logo

పేరు మారినా.. తీరు మారలే

ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య సేవల బలోపేతానికి ప్రభుత్వం పలు సంస్కరణల అమలుకు ఉపక్రమించింది. గత ఏడాది నుంచి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాలను దశల వారీగా పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. వాటిలో వైద్యుడు, సిబ్బందిని భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు

Published : 28 Jun 2022 01:22 IST

 వసతులు లేవు..వైద్యులు, సిబ్బంది కొరత
పల్లె దవాఖానాల తీరిది..

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

చింతల్‌ఘాట్‌లో అద్దె భవనంలో..

ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య సేవల బలోపేతానికి ప్రభుత్వం పలు సంస్కరణల అమలుకు ఉపక్రమించింది. గత ఏడాది నుంచి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాలను దశల వారీగా పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. వాటిలో వైద్యుడు, సిబ్బందిని భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆయా కేంద్రాలు స్థానికులకు భరోసా కల్పించాలని, మిగిలిన ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేలా చేయాలని సంకల్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. వీటిలో పనిచేసేందుకు వైద్యులు ఆసక్తి చూపడంలేదు. చాలాచోట్ల అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో.. కనీస సౌకర్యాలు లేక ఆసుపత్రి సిబ్బందితోపాటు రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కథనం.
సేవలకు భరోసా దక్కితేనే..
జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, జోగిపేట వైద్యారోగ్యశాఖ డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 246 ఆరోగ్య ఉప కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ ఆరోగ్య ఉప కేంద్రాల్లో చలిజ్వరం, దగ్గు, బీపీ, షుగుర్‌, మలేరియా, క్షయ, దీర్ఘకాలిక రోగులకు వైద్య సేవలందిస్తుంటారు. మందులను ఉచితంగా పంపిణీ చేస్తారు. అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణ(ఎన్‌సీడీ), గర్భిణులకు నెలవారీ పరీక్షలు, బుధ, శని వారాల్లో చిన్న పిల్లలకు టీకాలు ఇస్తుంటారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆయా సబ్‌సెంటర్లు, పల్లె దవాఖానాల్లో వైద్యుడు, ఏఎన్‌ఎం కీలకంగా పని చేయాలి. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాలు, పట్టణ వార్డుల పర్యవేక్షణ బాధ్యత వారిదే. సహాయకులుగా ఆశా కార్యకర్తలుంటారు.
చేరడానికి.. ఆసక్తి చూపడం లేదు
తొలి విడతలో భాగంగా 20 సబ్‌ సెంటర్లను పల్లె పల్లె దవాఖానాలుగా మార్చారు. అందులో 100 మంది వైద్యుల భర్తీకి జిల్లా వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇప్పటి వరకు 11 మంది ఆయుష్‌ వైద్యులు మాత్రమే భర్తీ అయ్యారు. రెండో విడతలో 100 ఆసుపత్రులను పల్లె దవాఖానాలుగా మార్పు చేసి 100 మంది ఎంబీబీఎస్‌ వైద్యుల భర్తీకి మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇప్పటి వరకు 13 మందిని భర్తీ చేశారు. వారిలో ముగ్గురు వివిధ కారణాలతో వెళ్లిపోయారు. ప్రస్తుతం పది మంది వైద్యులు మాత్రమే సేవలందిస్తున్నారు. మూడో విడతలో పల్లె దవాఖానాల్లో 104 ఆసుపత్రులను గుర్తించారు. వైద్యుల భర్తీకి ప్రకటన ఇవ్వగా.. 33 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈనెల 27న కౌన్సిలింగ్‌ నిర్వహించగా.. 11 మంది మాత్రమే చేరారు. వీరిలో ఎంత మంది విధులను కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే. విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నా.. పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. చేరివారూ ఎంతకాలం పనిచేస్తారో స్పష్టత లేదు. దీనివల్ల ప్రభుత్వం ఆశయం నెరవేరడం లేదు. దూరాభారం, వసతులు లేమి, తక్కువ వేతనాలు తదితర కారణాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.


సమస్యలను అధిగమిస్తాం..
-గాయత్రీదేవి, జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి

జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలను దశల వారీగా పల్లె దవాఖానాలుగా మార్పు చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలో మార్పులు చేస్తున్నాం. వాటిలో పలు రకాల సమస్యలున్నాయి.. వాటిని అధిగమిస్తాం. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రత్యేక వైద్యుడిని భర్తీ చేయాలని ప్రభుత్వం సూచనల మేరకు నడుచుకుంటున్నాం. వారిలో కొందరు ఆసక్తి చూపడం లేదు. కొత్తగా భవనాలు కావాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. మంజూరు చేస్తే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.


ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలకు భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని జిల్లా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ప్రభుత్వానికి కొత్త భవనాలు 61 నిర్మించాలని నివేదిక అందించారు. ఇప్పటి వరకు ఒక్కటీ మంజూరు ఊసలేదు. ప్రతి ఆరు నెలలకోసారి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని సంబంధితశాఖ అధికారులు వివరించారు.
బడ్జెట్‌ లేక ఇబ్బందులు
పల్లె దవాఖానాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు చేయలేదు. దీని వల్ల ఆయా ఆసుపత్రుల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పీహెచ్‌సీ నుంచి కావాల్సిన మందులు, సామగ్రిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇంజిక్షన్లు నిల్వ చేయడానికి ప్రత్యేక రిఫ్రిజిరేటర్లు లేకపోవడం వల్ల.. వారంతా పీహెచ్‌సీ నుంచి ఓ డబ్బాలో వాటిని తీసుకెళ్లాల్సి వస్తోంది. మంచినీరు, శౌచాలయాలు, ప్రత్యేక గదులు లేకపోవడంతో వైద్య సిబ్బందితో పాటు.. రోగులు అవస్థలు పడాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని