logo

బోధనలో నైపుణ్యం.. ప్రతిభకు పురస్కారం

భాషపై పట్టు సాధిస్తే ఎందులోనైనా రాణించగలరు.. ఇది నిపుణులు చెప్పే మాట. ఆంగ్లంపై ఆసక్తితో అటువైపు అడుగేసి దాన్ని బోధించే ఉపాధ్యాయులుగా మారారు. ఆసక్తితో పిల్లలకు వినూత్నంగా పాఠాలు చెబుతూ..

Published : 10 Aug 2022 01:46 IST

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం


సిక్కింలో జరిగిన శిక్షణలో ప్రశంసాపత్రం అందుకుంటున్న రాజమల్లు

భాషపై పట్టు సాధిస్తే ఎందులోనైనా రాణించగలరు.. ఇది నిపుణులు చెప్పే మాట. ఆంగ్లంపై ఆసక్తితో అటువైపు అడుగేసి దాన్ని బోధించే ఉపాధ్యాయులుగా మారారు. ఆసక్తితో పిల్లలకు వినూత్నంగా పాఠాలు చెబుతూ.. మరోవైపు రిసోర్సుపర్సర్లుగా తమ తోటివారికి బోధనా నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. తమ ప్రతిభతో ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకుంటున్నారు. ఇటీవల సిక్కింలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను ఆకట్టుకొని ప్రశంసలు, అవార్డులు గెలుచుకోవడం విశేషం.

రిసోర్సుపర్సన్‌గా..
అక్కన్నపేట మండలం కట్కూర్‌కు చెందిన పంజ రాజమల్లు ఆంగ్ల బోధనలో దిట్ట. ప్రస్తుతం హుస్నాబాద్‌లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈయన విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే కొనసాగింది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈడీతో పాటు పీజీ పూర్తి చేశారు. 1998 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన అతడు కాళేశ్వరం, కోహెడ, అంతకపేట, గౌరవెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పని చేశారు. తానెక్కడ పని చేసినా ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2015 నుంచి కీ రీసోర్సు పర్సన్‌గా సహచర ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల దిల్లీ, బెంగళూరు, సిక్కిం, హైదరాబాద్‌లో ఆంగ్లభాష, బోధన నైపుణ్యాలపై జరిగిన వివిధ సెమినార్లు, సదస్సులకు హాజరయ్యారు. తాజాగా మైసూర్‌లోని ప్రాంతీయ విద్యాకేంద్రంలో ఈ నెల 2 నుంచి జరిగిన ఎన్‌సీఈఆర్‌టీ 5 రోజుల శిక్షణలో పాల్గొన్నారు.


రమణి

పాఠ్యపుస్తక రచయిత్రిగా..
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం ప్రాథమికోన్నత పాఠశాలలో రమణి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్‌ అంటే ఆమెకు చాలా ఇష్టం. 18వ ఏట వివాహం జరిగింది. అత్తింటివారు విద్యాభ్యాసానికి సాగించేందుకు ప్రోత్సహిస్తూ సహకరించారు. దూరవిద్య ద్వారా డీగ్రీ, పీజీ, రెగ్యులర్‌గా బీఈడీ పూర్తి చేశారు. 2002 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. దౌల్తాబాద్‌, రామచంద్రాపురం పాఠశాలల్లో పని చేశారు. ప్రస్తుతం ఇంద్రేశం పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు పాఠాలు చెబుతూనే మరోవైపు 3, 4 తరగతులకు సంబంధించి ఆంగ్ల పాఠ్యాంశాలు రాస్తున్నారు. పాఠ్యపుస్తక రచయిత్రిగానే కాకుండా ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన హ్యాండ్‌బుక్స్‌, మాడ్యూల్స్‌ రూపొందిస్తున్నారు. ఇటీవల మైసూర్‌లో జరిగిన శిక్షణలో పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts