logo

పింఛన్లపై ఆశల ఊసులు..

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ.. పింఛను కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి తీపి కబురు అందింది. ఈనెల 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరుకు మంత్రి మండలి నిర్ణయించిన నేపథ్యంలో మరోమారు ఆశలు చిగురించాయి.

Published : 14 Aug 2022 01:46 IST

బలోపేతం దిశగా అంగన్‌వాడీ కేంద్రాలు

న్యూస్‌టుడే, సిద్దిపేట

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ.. పింఛను కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి తీపి కబురు అందింది. ఈనెల 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరుకు మంత్రి మండలి నిర్ణయించిన నేపథ్యంలో మరోమారు ఆశలు చిగురించాయి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అర్హులకు.. త్వరలోనే పింఛను సొమ్ము మంజూరు కానున్న నేపథ్యంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దమొత్తంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నిర్ణయించడంతో బలోపేతం దిశగా చర్యలు చేపట్టినట్లయింది.

జిల్లాలోని వివిధ విభాగాల్లో పింఛను నిమ్తితం 11,477 దరఖాస్తులు ఆమోదం పొంది రాష్ట్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. వృద్ధాప్య పింఛను నిమిత్తం 57 ఏళ్లు, ఆపై వయసు కలిగిన దరఖాస్తుదారుల సంఖ్య 25,168. ఆసరా పింఛను 57 ఏళ్ల వయసున్న వారికి అందిస్తామని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించడంతో దరఖాస్తుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 65 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు సహా హెచ్‌ఐవీ, బోధకాల బాధితులకు ప్రభుత్వం ప్రతి నెలా పింఛను చెల్లిస్తోంది. రెండోసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పింఛను మొత్తాన్ని పెంచింది. ఫలితంగా దివ్యాంగులకు నెలకు రూ.3016, మిగిలిన విభాగాల వారికి రూ.2,016 చొప్పున ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 1,71,637 మందికి నెలలో మొత్తం రూ.37 కోట్లు చెల్లిస్తున్నారు. సీఎం గత ఎన్నికల్లో ప్రకటించిన మేర ఆసరా పథకానికి అర్హత వయసును గత ఏడాది ఆగస్టులో 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. అదే నెలలో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభమైంది. ఈ మేరకు జిల్లాలో 57 ఏళ్లు, ఆపైబడి ఉన్న వారు పెద్దమొత్తంలో దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించారు. తాజాగా మంత్రివర్గ నిర్ణయంతో తాము పింఛను అందుకుంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అత్యధికంగా సిద్దిపేట అర్బన్‌ మండలంలో..

జిల్లాలో ఆమోదం పొంది రాష్ట్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలిస్తే.. వృద్ధాప్య - 2728, వితంతు - 5636, దివ్యాంగ - 406, కల్లుగీత కార్మికులు - 364, నేత కార్మికులు - 211, ఒంటరి మహిళలు - 183, బీడీ కార్మికులు - 1555, హెచ్‌ఐవీ - 239, బోదకాలు - 155 మంది ఉన్నారు. 57 ఏళ్లు, ఆపైన వయసుండి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 25,168. అందులో అత్యధికంగా సిద్దిపేట అర్బన్‌ మండలం నుంచి 2908 మంది, అత్యల్పంగా కొమురవెల్లి మండలం నుంచి 458 ఉన్నారు. జాబితా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి మార్గ్గదర్శకాలు రాగానే మంజూరు, పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

అవస్థలకు చెల్లుచీటి పలికేలా..

జిల్లాలో చేర్యాల, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌, సిద్దిపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1150 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఉపాధ్యాయులు, ఆయాలు లేక నిర్వహణపై ప్రభావం చూపుతోంది. కేంద్రాల పరిధిలో బాలలకు పూర్వ ప్రాథమిక విద్య బోధన, గర్భిణులు, తల్లులకు భోజనం, సరుకుల పంపిణీ సక్రమంగా సాగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పలుచోట్ల పర్యవేక్షణ, కార్యక్రమాల నిర్వహణ నామమాత్రంగా మారింది. గత ఏడాది సెప్టెంబరులో 129 అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా.. 2648 మంది దరఖాస్తు చేశారు. అప్పటి నుంచి నియామకాల ప్రక్రియ ముందడుగు పడలేదు. ఫలితంగా ఖాళీల సంఖ్య మరింతగా పెరిగింది. సీఎం ప్రకటనతో ఆ కష్టాలకు చెల్లుచీటి పలికే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని