logo

తగ్గిన పత్తి కొనుగోళ్లు

ఇటీవలి వరకు మురిపించిన పత్తి ధర అమాంతం పడిపోవటంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు గణనీయంగా తగ్గిపోయింది.

Published : 02 Dec 2022 02:02 IST

ధర పెరుగుదలపై అన్నదాతలు ఆశలు

న్యూస్‌టుడే - గజ్వేల్‌, మద్దూరు

బైరాన్‌పల్లిలో ఓ రైతు ఇంట్లో నిల్వ

టీవలి వరకు మురిపించిన పత్తి ధర అమాంతం పడిపోవటంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు గణనీయంగా తగ్గిపోయింది. ధర పెరుగుతుందేమోనని రైతులు వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆచితూచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. క్వింటాలు ధర రూ.9330 నమోదు అయిన సందర్భంలో జిల్లాలో రోజుకు 3900 క్వింటాళ్ల నుంచి 4200 క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు సాగాయి. ఇప్పుడు క్వింటా పత్తి ధర రూ.8800 చేరువలో ఉండటంతో ప్రస్తుతం రోజుకు 2900 నుంచి 3800 క్వింటాళ్ల వరకు విక్రయాలు నమోదు అవుతున్నాయి. మొత్తంగా ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వ్యాపారులు 11630 మంది రైతుల నుంచి 85,523 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గురువారం క్వింటాలుకు రూ.8850 ధర పలికింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.6380కు విపణిలో ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో సీసీఐ (భారతపత్తి సంస్థ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జిల్లాలోని 27 మిల్లులు, ప్రైవేటు కాంటాల ద్వారా కొనుగోళ్లు సాగుతున్నాయి. రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలున్నాయని భావించిన రైతులు కొందరు పత్తిని ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1,16,814 ఎకరాల్లో రెతులు పత్తి సాగుచేయగా ఒక్కో ఎకరానికి ఎనిమిదిన్నర క్వింటాళ్ల మేర దిగుబడి ఆశించారు. అధిక వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో ఎకరానికి మూడు నుంచి ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు 20 శాతం మాత్రమే విక్రయాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు మొదలయ్యాక పది రోజుల వ్యవధిలో క్వింటాలుకు రూ.వెయ్యి తగ్గింది. గత ఏడాది ఒక దశలో రూ.14 వేల ధర పలికింది. ఈసారి కనీసం రూ.10 వేలు దాటినా అమ్మేయాలని కర్షకులు చూస్తున్నారు. దళారులు పల్లెలకు వచ్చి అడుగుతున్నారు. ధరను బట్టి రైతులు వెనుకంజ వేస్తున్నారు.


ఎనిమిది క్వింటాళ్లు దాచిన..

నందనమైన కనకయ్య, బైరాన్‌పల్లి

ధర పెరుగుతుందని చూస్తున్న. రెండెకరాల్లో పత్తి సాగు చేసిన. రూ.60 వేల పెట్టుబడి అయింది. భవిష్యత్తులో ధర పెరుగుతుందని ఎనిమిది క్వింటాళ్లు ఇంట్లోనే పెట్టుకున్న. కనీసం పెట్టుబడులైనా వస్తాయని ఆశపడుతున్న.


పెట్టుబడైనా రాకపోతే ఎట్లా?

లక్ష్మారెడ్డి, రైతు, ధర్మారం.

ధర ఎక్కువగా ఉంటుందని పత్తి సాగు చేసిన. ఆశతో మూడెకరాల్లో వేసిన. రూ.లక్ష పెట్టుబడి అయింది. ధర ప్రస్తుతం తగ్గింది. అమ్మలేదు. తెగుళ్లతో దిగుబడి తగ్గింది. పెట్టుబడులైనా రాకపోతే కష్టమే. పది క్వింటాళ్లు అమ్మకానికి ఉంది. రైతుల అవసరాలు చూసి వ్యాపారులు రేటు తగ్గిస్తున్నరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని