logo

యార్డులున్నా.. వసతులు కరవు

అందోలు నియోజకవర్గ పరిధిలోని జోగిపేట, వట్‌పల్లి, రాయికోడ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో రైతులకు సరైన వసతులు లేవు.

Published : 30 Jan 2023 02:56 IST

అన్నదాతలకు తప్పని ఇబ్బందులు

న్యూస్‌టుడే, జోగిపేట, వట్‌పల్లి, రాయికోడ్‌: అందోలు నియోజకవర్గ పరిధిలోని జోగిపేట, వట్‌పల్లి, రాయికోడ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో రైతులకు సరైన వసతులు లేవు. అన్నదాతలకు అసౌకర్యంగా మారాయి. పంటల విక్రయానికి వచ్చే వారికి సదుపాయాల కల్పనపై పాలకవర్గం, అధికారులు దృష్టి సారించకపోవడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కథనం.

వట్‌పల్లి: ఇతర కార్యాలయాలకు వినియోగం

వట్‌పల్లి మార్కెట్‌ యార్డులో రైతుల సౌకర్యార్థం నిర్మించిన పలు భవనాలను ఇతర శాఖల అధికారులకు కేటాయించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విశ్రాంతి భవనం పోలీసు స్టేషనుకు, మరో భవనాన్ని తహసీల్దార్‌ కార్యాలయాలకు అప్పగించారు. యార్డు ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయి. మూత్రశాలలున్నా.. వినియోగానికి అనుకూలంగా లేవు. ప్రహరీ కూలిపోయింది.  

రాయికోడ్‌: అన్నీ సమస్యలే..

రాయికోడ్‌ మార్కెట్‌ యార్డులో విశ్రాంతి భవనాన్ని నిర్మించ లేదు. ఈ యార్డుకు రాయికోడ్‌ మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు ధాన్యం తెస్తుంటారు. వారికి మౌలిక వసతులు కరవయ్యాయి. యార్డు చుట్టూ నిర్మించిన రక్షణ గోడ కూలిపోయింది.

జోగిపేట: విశ్రాంతి భవనం శిథిలం

జోగిపేట పట్టణంలోని మార్కెట్‌ యార్డులో నిర్మించిన రైతు విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరింది. నిత్యం ఇక్కడికి చౌటకూరు, పుల్కల్‌, అందోలు హత్నూర మండలాలకు చెందిన రైతులు ధాన్యం, ఇతర పంటల విక్రయానికి వస్తుంటారు. భవనం నిర్మించినప్పుడు కొంత కాలం రైతులకు ఉపయోగపడ్డా.. పదేళ్లుగా నిరుపయోగంగా మారింది. దాని చుట్టూ ముళ్ల పొదలు పెరిగాయి. గోదాం భవనం గోడ కూలిపోయింది. దిగుబడులు ఆరబెట్టడానికి నిర్మించిన ప్లాట్‌ఫాంలు శిథిలమయ్యాయి. తాగునీటికి మినీ ట్యాంకులు నిర్మించినా.. పరిశుభత్ర పాటించడం లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు.


సౌకర్యాల కల్పనకు చర్యలు

ప్రతాప్‌గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి జోగిపేట

మార్కెట్‌ యార్డుల్లో రైతులకు సైకర్యాలు కల్పించేదందుకు చర్యలు చేపడతాం, కూలిన భవనాలు, షెడ్లు, ప్రహరీల మరమ్మతులకు నిధులు కావాలని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని