logo

పోలేపల్లి ఎల్లమ్మా.. శరణంటిమి మాయమ్మా

గ్రామీణ ప్రజల ఇంటిదేవతగా.. కోరికలు తీర్చే తల్లిగా కొలిచే పోలేపల్లిలోని ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి.

Published : 09 Feb 2023 01:59 IST

నేటి నుంచి ఉత్సవాలు

గర్భగుడిలో ఎల్లమ్మ

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: గ్రామీణ ప్రజల ఇంటిదేవతగా.. కోరికలు తీర్చే తల్లిగా కొలిచే పోలేపల్లిలోని ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో వెలసిన అమ్మవారికి ప్రతి ఏడాది మహాశివరాత్రికి ముందు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. అందులో భాగంగా 10, 11 తేదీల్లో జరిగే ప్రధాన ఘట్టాలను తిలకించేందుకు  భక్తులు అధికసంఖ్యలో తరలివస్తుంటారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలి వచ్చి సేవించుకుంటారు. 9న రాత్రి గ్రామంలో విగ్రహాలను పల్లకీలో ఎల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకు రావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని మేనేజరు రాజేందర్‌రెడ్డి, కమిటీ ఛైర్మన్‌ ఎం.వెంకటేశ్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ‘సిరిమానోత్సవం’ (సిడె) తిలకించేందుకు సుమారు లక్ష మంది వస్తుంటారు. సిడెపై అమ్మవారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే పసుపు, గవ్వలతో కూడిన ‘భండారు’ను భక్తులు అమ్మవారి విగ్రహంపై చల్లుతారు. శనివారం రథోత్సవం నిర్వహిస్తారు. ఎల్లమ్మ దేవత స్వయంభువుగా వ్యవసాయ పొలాల్లో వెలసినట్లు భక్తులు నమ్ముతారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, ఇతర సౌకర్యాల ఏర్పాటు పూర్తయ్యాయి. తాగునీరు, స్నానాలు, వంటలకు సదుపాయం, విద్యుత్తు సరఫరా ఉన్నాయి. బోనాలు తీయడం, కోళ్లను బలి ఇస్తూ మొక్కులు తీర్చుకుంటారు. కోస్గి, కొడంగల్‌, పరిగి, తాండూరు, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

పోలేపల్లిలో గుడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని