logo

వారంలో లక్ష మందికి పని కల్పిస్తాం

‘ప్రస్తుతం వేసవి ఎండలు మండుతున్నాయి. ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు అనువైన కాలం. అందుకే కూలీలు కోరిన వెంటనే పని కల్పించేలా ఉపాధి సిబ్బంది, అధికారులు చొరవ చూపుతున్నారని’ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌రావు అన్నారు.

Published : 01 Apr 2023 01:41 IST

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌రావుతో ‘న్యూస్‌టుడే’
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

‘ప్రస్తుతం వేసవి ఎండలు మండుతున్నాయి. ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు అనువైన కాలం. అందుకే కూలీలు కోరిన వెంటనే పని కల్పించేలా ఉపాధి సిబ్బంది, అధికారులు చొరవ చూపుతున్నారని’ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌రావు అన్నారు. ఆయనతో ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు.

ఊరూరా ప్రచారం

ఉపాధి హామీ పథకంలో జాబ్‌ కార్డున్న అందరికీ పనులు కల్పిస్తాం. ఈ దిశగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రచారం చేయిస్తున్నాం. కొత్త జాబ్‌కార్డులతో పాటు.. బ్యాంకు ఖాతాలు తెరిపించేలా సిబ్బంది కూలీలకు అండగా నిలుస్తున్నారు. జిల్లా పాలనాధికారి శరత్‌ ప్రతి గ్రామంలో 50 శాతానికి మంచి పనులు కల్పించేలా ఆదేశాలు ఇచ్చారు.

ఆందోళన వద్దు.. డబ్బులు జమవుతాయి

కొందరు కూలీలు సకాలంలో డబ్బులు జమ కావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరూ అధైర్య పడవద్దు. ప్రతి ఒక్కరికీ డబ్బులు ఖాతాల్లో జమవుతాయి. తనతోపాటు ఏపీడీలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలిసి మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఏప్రిల్‌ తొలి వారంలో 1.16 లక్షల మందికి పని కల్పించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఆ దిశగా కృషి చేస్తున్నాం.

నర్సరీల్లో మొక్కల సంరక్షణ

జిల్లాలో 647 వన నర్సరీలున్నాయి. వాటిలో విత్తనాలు మొలకెత్తని పక్షంలో మళ్లీ నాటాలని ఆదేశించాం. వచ్చే 15 రోజుల్లో 100 శాతం మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎండ వేడిమికి మొక్కల సంరక్షణకు చాలా చోట్ల ఇప్పటికే పరదాలు పంపిణీ చేశాం. నీటి తడులు తడిపిస్తూ మొక్కల సంరక్షణ చేసేలా ఎంపీడీవోలు పర్యవేక్షించాలి.

అత్యధికం అందోలు మండలంలో..

ప్రస్తుత గణాంకాల ప్రకారం పనుల కల్పనలో జిల్లాలో అందోలు మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. అక్కడ 2321 మంది పనులు చేస్తున్నారు. కంది మండలంలో 2743 మందికి కేవలం 803 మంది మాత్రమే పనులకు వస్తున్నారు.

ప్రాథమిక చికిత్స కిట్లు కావాలని కోరుతాం

జిల్లాలో ఉపాధి కూలీలు పనులకు వెళ్లిన చోట గతంలో పరదాలు, టెంట్ల ఏర్పాట్లు ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం వాటి పంపిణీని నిలిపివేసింది. జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి ప్రతి గ్రామ పంచాయతీకి ప్రథమ చికిత్స కిట్లు ఇవ్వాలని కోరుతూ.. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని