logo

ఎంపీని అనుసరించి.. దాడికి తెగబడి

మెదక్‌ ఎంపీ, దుబ్బాక భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేయాలని రాజు ముందే నిర్ణయించుకున్నట్లు జరిగిన పరిణామాలను బట్టి తెలిసింది.

Published : 31 Oct 2023 03:10 IST

 ముందుగా నిర్ణయించుకొనే కత్తి కొనుగోలు
రెండు గ్రామాల్లో కార్యకర్తలతో  కలిసి తిరిగిన నిందితుడు

న్యూస్‌టుడే, చేగుంట, దౌల్తాబాద్‌: మెదక్‌ ఎంపీ, దుబ్బాక భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేయాలని రాజు ముందే నిర్ణయించుకున్నట్లు జరిగిన పరిణామాలను బట్టి తెలిసింది. తదనుగుణంగానే అతను మిరుదొడ్డిలో కత్తి కొనుగోలు చేశాడు. సోమవారం ఉదయం దౌల్తాబాద్‌ మండలం గాజులపల్లిలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నిందితుడు గట్టని రాజు అక్కడి నుంచే ఎంపీని అనుసరిస్తున్నట్లు భారాస నాయకులు చెబుతున్నారు. దొమ్మాట, ముత్యంపేటలో దాడి చేసేందుకు వెంట వచ్చినా వీలుపడలేదు. అక్కడి నుంచి సూరంపల్లికి వచ్చి ప్రచార రథంపై ఎంపీ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఎవ్వరికి అనుమానం రాకుండా రాజు ప్రజల్లోనే ఉన్నాడు. తర్వాత స్థానిక బస్టాండ్‌ వద్ద ప్రచారరథంపై నుంచి ఎంపీ ప్రసంగించారు. అప్పుడు జనంలో ఒక చోట నిందితుడు నిలబడి ఉన్నాడు. అతని కదలికలు ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. ప్రభాకర్‌రెడ్డి పాస్టర్‌ అంజయ్య ఇంట్లోకి వెళ్లి బయటకు వచ్చి కార్యకర్తలతో స్వీయచిత్రాలు దిగుతున్న సమయాన్ని దాడికి అనువైనదిగా భావించాడు. కారు వద్ద ప్రభాకర్‌రెడ్డి చుట్టూ అభిమానులు, కార్యకర్తలు 50 మందికిపైగా గుమిగూడారు. అందరూ ఫొటోలు దిగుతున్న సమయంలో కారు వెనుక రాజు నిలబడి ఉన్నాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో రాజుపై గన్‌మెన్‌ ప్రభాకర్‌కు ఓ కన్నేసి ఉంచాడు. ఈ ఘటనతో సూరంపల్లి గ్రామస్థులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఈ ఘటన జరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడిచింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగానూ సంచలనమైంది.

ఘటనా స్థలంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో స్వీయ చిత్రాలు దిగుతున్న భారాస కార్యకర్తలు వెనుక గన్‌మెన్‌ ప్రభాకర్‌


ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరిగిన క్రమం ఇది

  •  సూరంపల్లికి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి చేరుకున్న సమయం: మ.12.35
  •  గ్రామంలో ఇంటింటి ప్రచారం ముగించింది: మ.1.15
  •  పరామర్శకు పాస్టర్‌ అంజయ్య ఇంటికి చేరుకొంది: మ.1.18
  •  అంజయ్య ఇంటి నుంచి బయటకు వచ్చింది: మ.1.26
  • అంజయ్య ఇంటి ఎదుట ఖాళీ స్థలంలో స్వీయ చిత్రాలు దిగిన సమయం: మ.1.28
  •  గట్టని రాజు ఎంపీపై హత్యాయత్నం చేసిన సమయం: మ.1.31
  • ఆ వెంటనే గన్‌మెన్‌ ప్రభాకర్‌ రాజును నిలువరించి పక్కకు లాగేయడంతో, పెద్దప్రమాదం తప్పింది.
  • రాజు చేతిలోని కత్తిని పట్టుకోవడంతో గన్‌మెన్‌ బొటనవేలుకి చిన్న గాయమైంది
  •  గన్‌మెన్‌ కత్తిని పట్టుకోవడం వల్ల ఎంపీకి మరింత లోతుగా గాయం కాకుండా నిలువరించగలిగారు.
  • తన రుమాలుతో ఎంపీ గాయాన్ని కప్పేసుకొన్నారు.
  •  గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సమయం: మ.1.50.

    ఎంపీపై దాడి అమానుషం: ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి  

మెదక్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో దుబ్బాక భారాస అభ్యర్థి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక దాడులకు చోటులేదని, దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.రాజకీయ అసహనంతో ఇలాంటి హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తునట్టు కనిపిస్తోందని, ఇలాంటివి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటివని, ప్రజలు వీటిని సహించరన్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని