logo

గెలుపు వ్యూహాలు

జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Updated : 18 Apr 2024 06:18 IST

పార్టీ శ్రేణులతో అభ్యర్థుల అంతర్గత సమావేశాలు

ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, జహీరాబాద్‌: జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారాస, కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు తమ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు జరుపుతూ ఆయా ప్రాంతాల్లో వారికి కలిసొచ్చే అంశాలను పరిశీలిస్తూ విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు.

 స్వల్ప వ్యత్యాసమే: త్రిభాష సంగమంగా పేరొందిన జహీరాబాద్‌ లోకసభ నియోజకవర్గంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారాస అభ్యర్థి బీబీపాటిల్‌ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పరంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యం సాధించింది. నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో భారాస కంటే కాంగ్రెస్‌ పార్టీకి 18,644 ఓట్లు అధికంగా వచ్చాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ కంటే భారాస 6,166 అధిక ఓట్లు సాధించింది.

 బలోపేతానికి చేరికలపై దృష్టి: మూడు ప్రధాన పార్టీలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలాబలాలను అంచనా వేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా చేరికలపై దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యంగా భాజపా, కాంగ్రెస్‌లు ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారాస తమ నేతలు పార్టీ విడిచి వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి రప్పించేందుకు హస్తం నేతలు చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు చెందిన నేతలు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొనేందుకు రంగం సిద్ధమైంది.

మద్దతు కూడగడుతూ..: కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థుల కుటుంబసభ్యులు తమ పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తల వద్దకు వెళ్లి మద్దతు తెలపాలని కోరుతున్నారు. పార్టీలో చేరికకు ఇబ్బందులుంటే ప్రచారంలో పాల్గొనకుండా అంతర్గతంగా సహకరించాలని అడుగుతున్నారు. ఇందుకు హమీ తీసుకుంటున్నారు. భాజపా అభ్యర్థి బీబీపాటిల్‌ తరఫున ఆయన సోదరులతో పాటు ఇతరులు పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఓసారి చుట్టేసి వచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ కూతురు సైతం పార్టీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ విజయం కోసం పనిచేసేలా సమాయత్తం చేస్తున్నారు. భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ తరఫున ఆయన బంధువులు విస్తృతంగా పర్యటిస్తూ తమ సామాజికవర్గానికి చెందిన నేతలు, సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ గంపగుత్తగా ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారాసను వీడిన నేతల వద్దకు వెళ్లి ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నారు.

క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు

భాజపా, భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముఖ్యనేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. లోపాలు తెలుసుకుంటూ మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలనే దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని