logo

కట్టడికి కదిలారు..

జిల్లాలో వైరస్‌ కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. పురపాలికల ఆధ్వర్యంలో ఇంటింటి జ్వర సర్వేతో ముందుకెళ్తున్నారు. మెప్మా అధికారులు, ఆర్పీలు, వైద్య సిబ్బంది లక్షణాలు గుర్తించి మందులు పంపిణీ చేస్తున్నారు.

Published : 23 Jan 2022 05:41 IST

పురపాలికలో ముమ్మరంగా ఇంటింటి జ్వర సర్వే


సూర్యాపేటలోని విద్యానగర్‌లో ఇంటింటి జ్వర సర్వే చేస్తున్న సిబ్బంది

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: జిల్లాలో వైరస్‌ కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. పురపాలికల ఆధ్వర్యంలో ఇంటింటి జ్వర సర్వేతో ముందుకెళ్తున్నారు. మెప్మా అధికారులు, ఆర్పీలు, వైద్య సిబ్బంది లక్షణాలు గుర్తించి మందులు పంపిణీ చేస్తున్నారు.

జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో అధికారులు శుక్రవారం నుంచి ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఐదు పురపాలికల్లో 210 బృందాలను నియమించారు. ఈ నెల 31 వరకు నిర్వహించనున్నారు.

టీకా వేసుకున్నా వదలదే... రెండు డోసులు టీకా వేసుకున్న వారిని కూడా మహమ్మారి వదలడం లేదు. మాస్కు ధరించకుండా విచ్చలవిడిగా తిరుగుతుండటంతో వైరస్‌ వ్యాపిస్తోంది. ఇటీవల జిల్లాలో నమోదైన కేసుల్లో టీకా వేసుకున్నా వారూ ఉన్నట్లు గుర్తించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రెండు డోసులు పూర్తి చేసుకొని తొమ్మిది నెలలు దాటిన వారికి  బూస్టర్‌ డోస్‌ వేస్తున్నారు. దీనిపై మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. సర్వేలో మొదటి, రెండు రోజులు పూర్తి చేసుకున్న వారిని గుర్తించి టీకా పంపిణీ చేస్తున్నారు.

దుకాణాలకు స్టిక్కర్లు.. కరోనా కట్టడికి మున్సిపల్‌ అధికారులు పట్టణాల్లోని కిరాణం, వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ దుకాణాల ముందు నో మాస్కు-నో వెంట్రీ స్టిక్కర్లను అంటిస్తున్నారు. దుకాణాలకు వచ్చేవారు మాస్కు, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించారు. పోలీసులు కూడా మాస్కులేని వారికి జరిమానాలు విధిస్తున్నారు.

పకడ్బందీగా సర్వే: పి.రామాంజూలరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట...  ప్రభుత్వ ఆదేశాలతో జ్వర సర్వే పకడ్బందీగా చేస్తున్నాం. కుటుంబ సభ్యుడి పూర్తి ఆరోగ్య వివరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నాం. బృందాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారలూ ఉన్నారు. ప్రజలంతా సహకరించి కట్టడిలో భాగస్వామ్యులు కావాలి.


కరోనా వ్యాప్తిపై మరింత అప్రమత్తం!

ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరికలపై వివరాల సేకరణ

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం ఈసారి మరింత అప్రమత్తమైంది. రాబోయే మూడు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఉన్నత వైద్యమండలి సూచించిన నేపథ్యంలో జిల్లా వైద్యశాఖ ఇంటింటి సర్వేను శుక్రవారం నుంచే ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ 96 శాతం, రెండో డోసునూ 76 శాతం పూర్తి చేశారు. ఇదే క్రమంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌, 60 ఏళ్లు పైబడిన వారికీ బూస్టర్‌ డోసు 10 శాతం వేశారు. ఇప్పటివరకు 2,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 215 మందికి పాజిటివ్‌ ఉన్నట్టు నిర్థరించారు. రెండో దశ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు కంటే మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యసేవలందించాలని, ప్రైవేటుకు వెళ్లొద్దని మంత్రి హరీష్‌ రావు సూచించిన నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ జ్వర కేసుల నమోదుపై జిల్లా వైద్యశాఖ దృష్టి సారించింది. ఓ పక్క హోం ఐసోలేషన్‌ కిట్లు ఇచ్చేందుకు సిద్ధమైన అధికారులు.. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో కేసుల వివరాలు సేకరిస్తున్నారు. దీని కోసం శనివారం జిల్లా వైద్యాధికారి కోటాచలం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన నివేదిక ప్రైవేటు ఆసుపత్రులకు పంపారు. ఆ ప్రకారం.. రోగి పేరు, చిరునామా, చేరిన ఆసుపత్రి, బాధితులు చేయించుకున్న కరోనా టీకాల వివరాలు, జ్వరం బారిన పడిన తేదీ, కొవిడ్‌ పాజిటివ్‌ ఉంటే ఆ వివరాలు, వారి చరవాణి నంబర్‌ను అందులో పేర్కొనాలని సూచించారు. ప్రతిరోజూ ఈ వివరాలు తమకు పంపాలని జిల్లా వైద్యశాఖ వారికి సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని