logo

పల్లెకు ప్రాథమిక చికిత్స.. పట్టణ వైద్యానికి ప్రాణం!

ఒకప్పుడు మశూచి, ప్లేగు లాంటి మహమ్మారులు ప్రజలను వణికించేవి. వేలాది ప్రాణాల్ని బలిగొనేవి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేవి. వైద్యం అందక దిక్కుతోచని స్థితి నెలకొనేది. ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సొచ్చేది. ఇప్పుడా పరిస్థితుల్లేవు.

Published : 12 Aug 2022 06:20 IST


కాలనీలకు వెళ్లి కొవిడ్‌ టీకాలు వేస్తున్న వైద్యసిబ్బంది

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: ఒకప్పుడు మశూచి, ప్లేగు లాంటి మహమ్మారులు ప్రజలను వణికించేవి. వేలాది ప్రాణాల్ని బలిగొనేవి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేవి. వైద్యం అందక దిక్కుతోచని స్థితి నెలకొనేది. ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సొచ్చేది. ఇప్పుడా పరిస్థితుల్లేవు. అలాంటి మహమ్మారులను చెక్‌ పెట్టారు. పోలియోనూ తుదముట్టించారు. కాలక్రమేనా.. సమీప పట్టణాల్లో మెరుగైన వైద్య సేవలకు బీజం వేశారు. ఈ దశలోనే పల్లెల్లోనూ ప్రాథమిక వైద్యానికి ప్రాణం పోశారు. ఇక్కడ నుంచే మెరుగైన వైద్య చికిత్సలకు శ్రీకారం చుట్టారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో విస్తరించిన వైద్యరంగం సేవలపై  అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఎయిమ్స్‌ స్థాయిలో ఎదుగుదల

ఉమ్మడి నల్గొండ జిల్లా పునర్విభజనతో సూర్యాపేట, యాదాద్రి భువనగిరిల్లోనూ 3 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. మున్సిపాలిటీల్లోనూ 2 ఏరియా, 4 అర్బన్‌ ఆసుపత్రుల్లో వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. జిల్లా వాసుల ఎయిమ్స్‌ కళ నెరవేరింది. అధునాతన వైద్యసేవలు జిల్లా దరిచేరాయి. ప్రైవేటు ఆసుపత్రులూ వందల్లోకి చేరాయి. ఇటీవల ఇంటర్నెట్‌ వైద్య సేవలకూ ఊతమిచ్చారు. ఇంటి దగ్గరే ఉండి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఇంటికే ఇంటి వద్దకే ఔషధాలు తెప్పించుకునే ఈ సేవలపై ఆసక్తి పెరుగుతోంది.

ఆరోగ్య బీమాతో

ఆరోగ్య బీమాలో జిల్లా ప్రజలు వెనకంజలో ఉన్నారు. ఆరోగ్యం మెరుగునకు ఆర్థికభారం పడకుండా ముందస్తు జాగ్రత్త కోసం బీమా చేస్తుంటారు. మన జిల్లాలో ఇప్పటికీ కేవలం 15-18 శాతమే ఆరోగ్య బీమాకు అర్హులు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌భవ పథకాలతోనే సరిపెట్టుకుంటున్నారు. పీఎం జన్‌ధన్‌ యోజన ద్వారానూ లబ్ధి పొందే వీలున్నా.. ఈ ప్రయోజనాలపైనా పూర్తి అవగాహన లేదు. ఇతర దేశాల వైద్య విధానం లో 70-95 శాతం మంది జాతీయ ఆరోగ్య సేవల పరిధిలోకి వస్తారు. ఇలా అవగాహన కల్పించాలనే భావన ఉంది. మధుమేహం, రక్తపోటు, కీళ్లనొప్పులు, కేన్సర్‌, కొవిడ్‌ వంటి వ్యాధుల వల్ల ఆర్థికభారం లేకుండా ఆరోగ్య బీమా అనివార్యం. జీవన విధానం లోనూ మార్పులతో ఈ భారాన్నీ నియంత్రించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ప్రోత్సాహకాలందిస్తూ..

తాజాగా జిల్లా జనాభా 40 లక్షలు దాటింది. ఇదే క్రమంలో ఒకప్పటితో పోలిస్తే కు.ని. శస్త్ర చికిత్సల్లోనూ ముందుంది. పీహెచ్‌సీ లలో లబ్ధిదారులకు రూ.880, రవాణా, భోజన ఖర్చులు అదనం. ప్రసవానికి రూ.13 వేలు నగదు అందజేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పథకం ద్వారా 1.60 లక్షల మందికి లబ్ది చేకూరింది. ఇలా ప్రోత్సాహకాలతో తల్లీబిడ్డల ఆరోగ్యానికి భరోసా అందుతోంది. ఈ దశలో 70 వేల జనాభా గల పీహెచ్‌సీ కి మందులు, ఇతరత్రా కోసం యేటా రూ.13 లక్షల వరకు ఉన్న బడ్జెట్‌ ను నాలుగింతలు పెంచాలి. ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలి. మన దగ్గర 2 వేల మందికి ఒకరున్నారు. పిల్లల వైద్యులూ 10 వేల మందికి ఒకరుండాలి. ఇక్కడ లేరు.


మరణాలకు చెక్‌

గతంతో పోలిస్తే జిల్లాలో ప్రసూతి మరణాలు తగ్గాయి. పీహెచ్‌సీ లో సాధారణ, ఏరియా ఆసుపత్రుల్లో పరీక్షలు, ఆపరేషన్‌ లు చేస్తున్నారు. సాధారణ ప్రసవానికే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రసూతి మరణ శాతం అతి స్వల్పమవుతోంది. నవజాత శిశు, ఐదేళ్లలోపు పిల్లల మరణాలు వెయ్యికి 33 నుంచి 20 కి తగ్గాయి. ఏఎన్‌ఎంలు, ఎంహెచ్‌డబ్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ల కృషితో పీహెచ్‌సీ లు గర్భిణీలు వస్తున్నారు. తద్వారా ప్రభుత్వ సంకల్పం ఫలిస్తోంది. ఇదే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య నిపుణుల సేవలూ దగ్గరయ్యాయి. వెరసి.. నాడు ప్రతి వెయ్యి మందిలో యేటా మరణాల సంఖ్య 45 నుంచి 10 కి తగ్గింది. ఆయుర్దాయం 35 నుంచి 70 యేళ్లకు పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని