logo

ఒంటికొస్తే.. ఇంటికే!

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యాలు సక్రమంగా లేవు. ఇటీవల కోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన వసతులు కల్పించట్లేదనే విషయం తేటతెల్లమైంది.

Published : 02 Dec 2022 03:25 IST

కోదాడ - న్యూస్‌టుడే

ఈ చిత్రంలోని మరుగుదొడ్లు కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం పాలె అన్నారం గ్రామంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందినవి. ఇక్కడ మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడంతో పాటు, వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. ఇక్కడ సుమారు 175 మంది విద్యనభ్యసిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యాలు సక్రమంగా లేవు. ఇటీవల కోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన వసతులు కల్పించట్లేదనే విషయం తేటతెల్లమైంది. మరుగుదొడ్లు ఉన్నా.. వాటి నిర్వహణకు ఎలాంటి నిధులు ప్రభుత్వం ఇవ్వట్లేదని ప్రభుత్వ ఉపాధ్యాయులు చెబుతున్నారు. నిధులు కేటాయించి ప్రభుత్వం ప్రతి పాఠశాలకు మరుగుదొడ్లు నిర్మించింది. కొన్నిచోట్ల నిధుల సమస్యతో గుత్తేదారులు మధ్యలోనే నిర్మాణాలు ఆపేశారు. మరి కొన్నిచోట్ల నీటి వసతి లేకపోవడంతో శౌచాలయాలు కంపు కొడుతున్నాయి. వాటి నిర్వహణకు ప్రభుత్వం పారిశుద్ధ్య సిబ్బందిని నియమించకపోవడం గమనార్హం. కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ జీతంలో నుంచి డబ్బులు వెచ్చించి పారిశుద్ధ్య పనులకు ఖర్చు చేస్తున్నారు. గ్రామ, పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు అప్పజెప్పామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ దిశగా విజయవంతం కాలేదు.

* కోదాడ నియోజకవర్గానికి చెందిన ఒక పాఠశాలలో మరుగు దొడ్లు లేకపోవడంతో విద్యార్థులు తమ గృహాలకు వెళ్లి వస్తున్నారని, దీంతో వారిని ఏమీ అనలేని పరిస్థితి ఉందని ఓ ఉపాధ్యాయుడు తెలిపాడు.


నీటి సమస్య వాస్తవమే..
- నరేశ్‌, ప్రధానోపాధ్యాయుడు, పాలె అన్నారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

మా పాఠశాలలో శౌచాలయాలు నిర్మించి వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు స్కావెంజర్‌ను నియమించాల్సి ఉంది. గతేడాది ఉపాధ్యాయులు కలిసి స్కావెంజరును  నియమించి డబ్బులు ఇచ్చాం. ఈసారి పంచాయతీ సిబ్బంది వారానికి రెండుసార్లు శుభ్రం చేస్తున్నారు. నీటి కొరత ఉన్నమాట వాస్తవమే.


పారిశుద్ధ్య కార్మికులకు అప్పజెప్పాం
-  అశోక్‌, డీఈవో, సూర్యాపేట

పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతను గ్రామాల్లో గ్రామపంచాయతీలకు, పట్టణాల్లో మున్సిపాలిటీలకు ప్రభుత్వం అప్పజెప్పింది. ప్రత్యేక నిధులంటూ ఏమి లేవు. సమస్య తీవ్రంగా ఉన్న పాఠశాలల పరిస్థితి గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. పారిశుద్ధ్యంపై సమీక్షలు నిర్వహిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని