logo

గీతార్చన.. ప్రతిభకు నిచ్చెన

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో దేవాలయాలు, ధార్మిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 1న భగవద్గీత శ్లోకాలపై కంఠస్థ పోటీలు నిర్వహించారు.

Updated : 05 Dec 2022 06:20 IST

సూర్యాపేట సాంస్కృతికం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో దేవాలయాలు, ధార్మిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 1న భగవద్గీత శ్లోకాలపై కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 250 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. గీతా జయంతిని పురస్కరించుకొని స్థానిక పబ్లిక్‌ క్లబ్‌లో చేపట్టిన సహస్ర గళ గీతార్చనలో విజేతలకు త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌ స్వామి ఆదివారం ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.


సంతోషంగా ఉంది
-కలకూరి అక్షయ, 7వ తరగతి విద్యార్థిని, మొదటి బహుమతి

ఆరో నుంచి 10వ తరగతి స్థాయిలో నిర్వహించిన గీతా శ్లోకాల పోటీల్లో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నేర్చుకునే సమయంలో పదాలను పలకడం కష్టంగా ఉండేది. మా ఉపాధ్యాయులు నా ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. వారి సూచనలతో సులువుగా శ్లోకాలను కంఠస్థం చేయగలిగాను. ఏటా పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. పాఠశాలలోనూ భగవద్గీతపై తరగతులు నిర్వహించి అవగాహన కల్పించాలి.


విజేతగా ముస్లిం బాలిక

ఈ పోటీల్లో పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్‌ తహూరనాజ్‌ పది శ్లోకాలను ధారాళంగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకున్నారు. ఈ పాఠశాలలో ఐదు రోజుల నుంచి గీతా శ్లోకాలను విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసుకొని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. ముస్లిం కుటుంబమైనప్పటికీ చిన్నారి ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి పోటీలకు పంపించారు. బాలిక సైతం అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్లోకాలను అనర్గాలంగా చెప్పి ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకోవడం విశేషం. మతాలకు సంబంధం లేకుండా పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన తహూరనాజ్‌ను ఐక్యవేదిక సభ్యులు అభినందించగా.. తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. పట్టణంలోని ఎంఏఎం పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని కలకూరి అక్షయ ఆరో తరగతి నుంచి పదో తరగతి విభాగంలో ప్రథమ బహుమతిని గెల్చుకున్నారు.


ఉపాధ్యాయులు నేర్పించారు
-షేక్‌ తహూర నాజ్‌, మూడో తరగతి  విద్యార్థిని, ప్రథమ బహుమతి

భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీల్లో పాల్గొనందుకు సంతోషంగా ఉంది. ఈ పోటీల నేపథ్యంలో మా పాఠశాలలో ఉపాధ్యాయులు మాకు శ్లోకాలు నేర్పారు. వాటిని కంఠస్థం చేయడంతో నిర్వీరామంగా చెప్పగలిగాను. అందుకే ప్రథమ బహుమతి లభించింది. మా తల్లిదండ్రులు నాకు తోడ్పాటును అందించారు. బహుమతి ఇచ్చిన స్ఫూర్తితో భగవద్గీతపై మరింత సాధన చేస్తాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని