logo

ఎప్పటికయ్యేనో.. మనబడి..!

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ మన ఊరు- మన బడి’ పథకం ప్రారంభించింది.

Published : 05 Dec 2022 06:17 IST

పాఠశాల గదుల నిర్మాణాలు పరిశీలిస్తున్న సూర్యాపేట విద్యాశాఖాధికారి (దాచిన చిత్రం)

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ మన ఊరు- మన బడి’ పథకం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1097 ప్రభుత్వ పాఠశాలల్లో తొలివిడత రూ.314 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. అయితే నిర్మాణ పనులు నెలల తరబడి సాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు మాత్రం అసౌకర్యాల నడుమ కాలం వెళ్ల దీస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3067 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. తొలి విడతలో వెయ్యి పాఠశాలలకు పైగా ఎంపిక చేశారు. రూ.30 లక్షల లోపు, రూ.30 లక్షలకు పైగా వ్యయం అయ్యే పాఠశాలలుగా విభజించి నిధులు కేటాయించారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం జూన్‌ మొదటి వారం నాటికి పనులు పూర్తి చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా మార్చిలోనే యుద్ధ ప్రాతిపదికన పనులకు పలు చోట్ల శంకుస్థాపనలు చేశారు. సాంకేతిక కారణాలతో పలుచోట్ల పనులు ప్రారంభం కాలేదు. ప్రాధాన్యతా క్రమంలో తొలివిడత పనులు పూర్తిచేయించేలా పర్యవేక్షణ పెంచుతామని డీఈవో భిక్షపతి తెలిపారు.

జాప్యానికి కారణాలివే..

గ్రామాల్లో విద్యాకమిటీల ఛైర్మన్లు పనులు చేసేందుకు ముందుకు రావటంలేదు. నిర్మాణ పనులు తాము చేస్తే నిధులు వస్తాయో..రావో అనే సందేహంతో చాలాచోట్ల ప్రారంభించలేదు. రూ.30 లక్షలకు పైగా ఖర్చుచేసే పనులను టెండర్లు పిలిచినా.. ఎంపికైన గుత్తేదారులు నిధుల విడుదలపై సందేహంతో ముందుకు రావటం లేదు.  పాఠశాల తరగతులు జరుగుతున్న సమయాల్లో పనులు చేయాలంటే విద్యార్థులు ఉంటారనే కారణంగా.. సెలవు రోజుల్లోనే ఎక్కువ శాతం పనులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయ కారణాలతో సైతం పలుచోట్ల పనులు ప్రారంభం కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని