logo

అంచనాలకు మించి.. వరించె

జిల్లాలో సాగునీరు సమృద్ధిగా ఉండటంతో అన్నదాతలు యాసంగిలో ఎక్కువగా వరి పంటపైనే ఆసక్తి చూపుతున్నారు.

Published : 26 Jan 2023 05:41 IST

చివ్వెంలలో నాటు వేసేందుకు నారును సిద్ధం చేస్తున్న కూలీలు

సూర్యాపేట కలెక్టరేట్, మద్దిరాల, న్యూస్‌టుడే: జిల్లాలో సాగునీరు సమృద్ధిగా ఉండటంతో అన్నదాతలు యాసంగిలో ఎక్కువగా వరి పంటపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇతర పంటలను వదిలేసి వరిపైనే గురి పెడుతుండటంతో గతంతో పోలిస్తే ఈ సారి సేద్యం పెరగనుంది. జిల్లాకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు విడుదల చేస్తుండటంతోపాటు చెరువుల్లోనూ జలకళ కనిపిస్తోంది. భూగర్భ జలాలూ పెరగడంతో బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉంది. పత్తి, మిర్చితో పోలిస్తే వరికి పెట్టుబడి తక్కువ ఉండటం, కొనుగోలు కేంద్రాల ద్వారా సులభంగా విక్రయించే వెసులుబాటు ఉండటంతో అన్నదాతలకు కలసివస్తోంది.

నామమాత్రంగా చిరుధాన్యాల సేద్యం

జిల్లాలో గత నెల వరకు కూలీల సమస్య తలెత్తింది. దీంతో వరినాట్లు కాస్త ఆలస్యమయ్యాయి. ఎక్కువ మంది వెదజల్లె, డ్రమ్‌ సీడర్‌ పద్ధతి ద్వారా సాగు చేపట్టారు. ప్రస్తుతం పత్తి తీత పనులు పూర్తి కావడంతో నాట్లు వేసేందుకు కూలీలు అందుబాటులోకి వచ్చారు. జిల్లాలో యాసంగిలో ఇప్పటి వరకు 2,77,730 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇంకా మరో 50 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది కంటే వరి 21,466 ఎకరాల్లో సేద్యం పెరగనుందని అంచనా. జిల్లాలో ఆరుతడి పంటల సాగు అంతంత మాత్రంగానే ఉంది. వరి తర్వాత పత్తి, మిర్చి సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలేవీ 1,050 ఎకరాలకు మించటం లేదు. పెట్టుబడి తక్కువ, వరి సాగుకు భూమి అనుకూలంగా ఉండటంతో అన్నదాతలు అటువైపే మొగ్గు చూపుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.


సమృద్ధి నీటి నిల్వలతో..

రామారావు నాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మిగతా పంటలపై దృష్టి సారించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో అన్నదాతలు ఎక్కువగా వరి వైపే మొగ్గు చూపుతున్నారు. చిరుధాన్యాలు పండించాలని, వాటి వినియోగంపై అవగాహన కల్పించాం. రైతులు వరి కాకుండా మిగతా పంటలూ పండించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని