logo

స్వశక్తి నీడగా.. ఆసక్తి తోడుగా..!

కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపిన వారితో పాటు, చదువును కొనసాగిస్తున్న బాలికలు స్వశక్తితో రాణించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుట్టు మిషన్‌, బ్యూటీషియన్‌ వృత్తి విద్యా కోర్సులపై గ్రామీణ బాలికలు ఆసక్తి చూపుతున్నారు.

Published : 07 Jun 2023 03:09 IST

మునుగోడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో వృత్తి విద్యా కోర్సులపై శిక్షణ పొందుతున్న బాలికలు

మునుగోడు, న్యూస్‌టుడే: కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపిన వారితో పాటు, చదువును కొనసాగిస్తున్న బాలికలు స్వశక్తితో రాణించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుట్టు మిషన్‌, బ్యూటీషియన్‌ వృత్తి విద్యా కోర్సులపై గ్రామీణ బాలికలు ఆసక్తి చూపుతున్నారు. కిశోర బాలికలకు 45 రోజుల పాటు ఉచితంగా కల్పిస్తున్న ఈ వృత్తి విద్య కోర్సులు వారికి ఎంతగానో దోహదపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మహిళ సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మునుగోడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న పలువురు బాలికలతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడింది.


రకరకాల డిజైన్లపై శిక్షణ పొందాను

తేజశ్విని, మునుగోడు

గత 35 రోజుల నుంచి బ్యూటీషియన్‌ వృత్తి విద్యా కోర్సులో రకరకాల డిజైన్లపై శిక్షణ పొందాను. మెహందీ, మేకప్‌, మేడిక్యూర్‌, పెడిక్యూర్‌ ఇలా మరెన్నో చేయడం నేర్చుకున్నాను. బ్యూటీషియన్‌ చేయడం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ప్రభుత్వం ఉచితంగా వేసవి కాలంలో శిక్షణ ఇవ్వడంతో పూర్తిగా నేర్చుకున్నాను.


శ్రద్ధతో నేర్చుకున్నాను..

హర్షిత, మునుగోడు

వేసవి కాలంలో ఇంటివద్ద ఖాళీగా ఉండటం ఇష్టం లేక శిక్షణ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధతో నేర్చుకుంటున్నాను. బ్యూటీషియన్‌పై ఉన్న ఇష్టంతో ఐబ్రోస్‌, పేషియల్‌, హేర్‌ స్టైల్‌, ఇలా నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఎన్నో కొత్త డిజైన్లపై శిక్షణ పొందాను. సొంతంగా బ్యూటీషియన్‌ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం ఉంది.


ఉపాధి కల్పిస్తుందని..

శ్రుతి , మునుగోడు మండలం

మాది వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌ పూర్తి చేశాను. కుట్టుమిషన్‌ ఉపాధి కల్పిస్తుందని ఈ శిక్షణకు వస్తున్నాను. కుట్లు, అల్లికలు పూర్తిగా నేర్చుకున్నాను. బ్లౌజులు, డ్రెస్‌లను కుట్టేవిధంగా శిక్షణ తీసుకున్నాను. ప్రభుత్వం కల్పించిన ఈ కార్యక్రమం ఎంతో బావుంది.


వృత్తి విద్యా కోర్సుపై ఆసక్తితో..

పరమేశ్వరీ, మునుగోడు మండలం

వృత్తి విద్య కోర్సులపై ఉన్న ఆసక్తితో వేసవి కాలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు వస్తున్నాను. 45 రోజుల పాటు సాగిన ఈ శిక్షణ తరగతుల్లో కుట్టుమిషన్‌ను పూర్తిగా నేర్చుకున్నాను. కొత్త డిజైన్లను కుట్టే విధంగా మాకు జ్యోతి టీచర్‌ శిక్షణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని