logo

కరెంటు కాటు..!

మర్రిపాడు, కావలి విద్యుత్తు లైన్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కరెంటు కాటుకు పలువురు బలవుతున్నారు. ఆవులు, గేదెలు సైతం మృత్యువాత పడుతున్నాయి. వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన స్తంభాలు ఒరిగి ఉండటం, విద్యుత్తు లైన్లు చేతికందే ఎత్తులో ఉండటం వల్ల రైతులు, కూలీల పాలిట

Published : 24 Jan 2022 06:12 IST

ఎక్కువ మంది మరణిస్తున్నా రికార్డుల్లో కొందరివే నమోదు


మర్రిపాడు మండలం తిక్కవరంలో చేతికందే ఎత్తులో ఉన్న విద్యుత్తు తీగలను చూపుతున్న రైతు

న్యూస్‌టుడే, మర్రిపాడు, కావలి విద్యుత్తు లైన్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కరెంటు కాటుకు పలువురు బలవుతున్నారు. ఆవులు, గేదెలు సైతం మృత్యువాత పడుతున్నాయి. వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన స్తంభాలు ఒరిగి ఉండటం, విద్యుత్తు లైన్లు చేతికందే ఎత్తులో ఉండటం వల్ల రైతులు, కూలీల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. మెట్ట మండలాల్లో బోర్ల ఆధారంగా మిరప, బొప్పాయి, కూరగాయల పంటలు, పత్తి, పొగాకు, నిమ్మ తోటలు సాగవుతున్నాయి. బోరు మోటారు కనెక్షన్‌ నిమిత్తం విద్యుత్తు లైన్లను తోటల మధ్య నుంచే లైన్లు వేశారు. తీగలు చెట్ల మధ్య నుంచి వెళ్లడం, చేతికందే ఎత్తులో ఉండటం, కొన్నిచోట్ల తెగిపడటం వంటివి గమనించకనే రైతులు విద్యుత్తు ప్రమాదాల బారిన పడుతున్నారు. తీగలకు అనుకుని ఉన్న చెట్లను గుర్తించి, వాటిని తొలగించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫీీజులు తక్కువ ఎత్తులో ఉండటం, వాటి చుట్టూ ఎలాంటి రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

దుక్కి దున్నడానికీ ఆటంకమే..

చాలా చోట్ల పొలాల్లో విద్యుత్తు తీగలు వేలాడుతుండటంతో దుక్కి దున్నే సమయంలో ట్రాక్టర్ల చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం, పొగాకు, జామాయిల్‌, వరిగడ్డి వంటివి తరలించే క్రమంలో వాహనాలకు తీగలు తగులుతున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని సరిచేసి సమస్య పరిష్కరించాలని అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి

నిత్యం విద్యుత్తు సంస్థల నిర్లక్ష్యంతో జిల్లాలో ఎక్కడో ఒకచోట అభాగ్యులు మరణిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం పదుల సంఖ్యలోనే ఈ మరణాలు నమోదవుతున్నాయి. అవి కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితేనే ఎక్కువగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. రైతులు మరణిస్తే అది వారి స్వయం కృతమేనంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పాడి పశువులు మృతి చెందిన సంఘటనలు అనేకమున్నా నమోదు ప్రక్రియ బహుస్వల్పరగా ఉంటోంది.

సచివాలయ సిబ్బంది సత్వరం స్పందించాలి : భాస్కర్‌, విశ్రాంత డిస్కం అధికారి

రైతులకు పగటిపూట తొమ్మిది గంటలు సరఫరా చేస్తున్నారు. ఆ సందర్భంలో ఫీజులు ఎగిరిపోవడం, ఏమైనా మరమ్మతులు చోటుచేసుకుంటే చాలా కలవరపడుతుంటారు. మరమ్మతులకు గురైనప్పుడు సచివాలయాల్లో విద్యుత్తు సిబ్బంది సత్వరం స్పందించాలి. సిబ్బంది అందుబాటులో ఉండటం సముచితం. రైతులు స్వయంగా మరమ్మతులు చేసే విధానం వీడాలి. శాఖా పరంగా విద్యుత్తు సామగ్రి నాణ్యమైనవి వినియోగించాలి. ఎల్‌సీ (లైన్‌ క్లియర్‌) తీసుకునేటప్పుడు, తిరిగి ఇచ్చేటప్పుడు అప్రమత్తత ప్రదానం.

మా లోపం లేకుండా చూస్తున్నాం

విజయకుమార్‌రెడ్డి, డిస్కం ఎస్‌ఇ, నెల్లూరు

అక్కడక్కడా మరణాలు చోటుచేసుకోవడం వాస్తవమే. మాలోపం ఎక్కడా లేకుండా చూసుకుంటున్నాం. రైతులు ఎక్కువగా వారి సొంత ఆవరణల్లోనే ఎర్త్‌, తదితర కారణాలతోనే మృత్యువాత పడుతున్నారు.

ఈ చిత్రం మర్రిపాడు మండలం ఇర్లపాడు వద్ద విద్యుత్తు నియంత్రిక వద్ద ఫ్యూజులు చేతికందే ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నాయి. నియంత్రిక చుట్టూ ఎలాంటి రక్షణ కంచె ఏర్పాటు చేయకపోడవంతో గతంలో ఒక గేదె మృత్యువాత పడింది. పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలో చదివే పిల్లలు పొరపాటున వాటిని తాకితే ప్రమాదం జరుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు పలుమార్ల్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు.

కావలి మండలం తాళ్లపాళెం దళితవాడకు చెందిన వినోద్‌(27) అనే యువ రైతు గత నెల 27న పొలంలో విద్యుత్తు తీగలు తగలడంతో మృతి చెందారు. పొలంలోకి వరినార్లు తీసుకెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. విద్యుత్తు తీగ వేలాడదీసిన కర్ర గాలికి పడిపోవడంతో ఈయన పాలిట మృత్యుపాశమైంది. ఈ ఘటన జరగడం తమ తప్పు కాదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందబోదని డిస్కం అధికారులు చెపుతున్నారు.

మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామంలో గత నెల 28న రైతు మస్తానయ్య తన పొగాకు బ్యారన్‌ వద్దకు వెళుతుండగా 11 కెవీ విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కొన్ని నెలల నుంచి విద్యుత్తు తీగలు కిందకు వేలాడుతున్నాయి. గమనించకపోవడంతో ప్రమాదం జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. మస్తానయ్య మృతితో అతని కుటుంబం రోడ్డున పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని