logo

రుధిర దారులు

నిర్లక్ష్య డ్రైవింగ్‌.. మితిమీరిన వేగం.. డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం.. మద్యం తాగి వాహనాలు నడపడం.. లాంటి పలు కారణాలే రోడ్డు ప్రమాదాలకు కారణమని పలు సంస్థల నివేదికలు పేర్కొన్నాయి. 

Updated : 20 Mar 2023 06:02 IST

తరచూ ప్రమాదాలతో ప్రయాణికుల్లో భయందోళన

వరికుంటపాడు కోల్డ్‌స్టోరేజీ సమీపంలో కారు డ్రైవర్‌ కునుకు తీయడంతో వంతెనపై నుంచి గోతిలో పడింది. కారు సినీఫక్కీలో మాదిరి 3 దఫాలుగా పల్టీలు కొట్టి బోల్తా పడటంతో ప్రకాశం జిల్లాకు చెందిన నాదెండ్ల వెంకటలక్ష్మమ్మ కారులోనే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.


మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద గతేడాది ఏప్రిల్‌ 27న ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు లారీలు వేగంగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.


న్యూస్‌టుడే, వరికుంటపాడు, వింజమూరు: నిర్లక్ష్య డ్రైవింగ్‌.. మితిమీరిన వేగం.. డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం.. మద్యం తాగి వాహనాలు నడపడం.. లాంటి పలు కారణాలే రోడ్డు ప్రమాదాలకు కారణమని పలు సంస్థల నివేదికలు పేర్కొన్నాయి.   వంతెనల వద్ద, రహదారి ఎత్తుగా ఉన్న ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసిన ఇనుప పట్టాలు సక్రమంగా లేకపోవడం..  జంక్షన్లలో ఎలాంటి సూచికలు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గ్రామ కూడళ్ల వద్ద  సెంట్రల్‌ లైటింగ్‌  లేకపోవడంతో రాత్రి సమయంలో వేగంగా వెళుతుండటంతో ప్రమాదాలు జరగుతున్నాయి. తిరుపతి జిల్లా నుంచి తెలంగాణలోని నకిరేకల్‌ వరకు ఎనిమిదేళ్ల కిత్రం జాతీయ రహదారి నిర్మించారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ 565గా పిలుస్తున్నారు. ఈ మార్గంలో రాయలసీమ, కర్నాటక నుంచి అమరావతికి రాకపోకలు సాగించేందుకు వాహనాల రాకపోకలు క్రమంగా పెరిగాయి. నాణ్యత లేని రహదారి నిర్మాణంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు నెర్రెలిచ్చి గోతులు ఏర్పడుతున్నాయి. వాటిని మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పెట్రోలింగ్‌ వాహనం రాత్రి సమయంలో గసీˆ్త తిరుగుతూ రహదారి పక్కన నిలిపిన వాహనాలను వారికి కేటాయించిన స్థలంలో ఆపేలా చర్యలు తీసుకుంటే ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు చెబుతున్నారు.  


ఘటనల వివరాలు..

* 2021 జూన్‌ 11న మర్రిపాడు మండలం బూదవాడ సమీపంలో కారు అతివేగంతో కూలీలు వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. 

* 2022 ఏప్రిల్‌ 27న మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. 

* మే 15న మర్రిపాడు మండలం ఏపిలగుంట వద్ద రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతున్న మహిళను వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  

సెప్టెంబర్‌ 5న మర్రిపాడు మండలం బాట సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతున్న వెంకట కార్తీక్‌రెడ్డి(5)ని కారు ఢీకొనడంతో మృత్యువాతపడ్డాడు.

* సెప్టెంబర్‌ 11న బూదవాడ వద్ద ద్విక్రవాహనదారుడిని కారు ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. 

* వరికుంటపాడులో అంకాలమ్మ వాగు వంతెనపై నుంచి కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.సకాలంలో స్థానికులు స్పందించడంతో కోలుకున్నారు.  


పది రోజుల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తాం
- ప్రసాద్‌, ఆర్‌పీవో

వగ్గంపల్లి, వరికుంటపాడు, దుత్తలూరు, బ్రాహ్మణపల్లి గ్రామ కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాం. గ్రామ కూడళ్ల వద్ద డీక్రాసింగ్‌ సిగ్నల్స్‌ను  తిరిగి వేయించాం. పది రోజుల్లో లైటింగ్‌ వేయిస్తాం. వంతెనల వద్ద, ఎత్తయిన ప్రాంతాల వద్ద సైడు ఏర్పాటు చేయాల్సిన ఇనుప పట్టాలు, సిగ్నల్స్‌ వంటి సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో సమస్యలు పరిష్కరిస్తాం. వంతెనలపై పడిన గోతులను తాత్కాలికంగా పూడ్చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని