logo

Nellore: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత..

గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పోతు రిత్విక్‌ (24) అంత్యక్రియలు బంధువుల మధ్య గొడవలకు దారితీశాయి.

Updated : 03 Nov 2023 10:05 IST

ఆస్తి వివాదాలతో సోదరుడే హత్యచేశాడని ఆరోపణ

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే : గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పోతు రిత్విక్‌ (24) అంత్యక్రియలు బంధువుల మధ్య గొడవలకు దారితీశాయి. యువకుడు బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతిచెందగా మృతదేహాన్ని బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకువచ్చారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో బంధువుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఆస్తి గొడవల నేపథ్యంలో స్వయాన పెదనాన్న కుమారుడే ఈ హత్య చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

చెన్నూరుకు చెందిన పోతు వెంకటేశ్వర్లుకు రవి, శ్రీనివాసులు కుమారులు. వెంకటేశ్వర్లుకు స్థానికంగా పలు వ్యాపారాలు ఉండేవి. ఆర్థిక ఇబ్బందులతో అవన్నీ మూసివేశారు. పలుచోట్ల ఆస్తులున్నాయి. రవికి పెళ్లికాగా భార్య గతంలో అనారోగ్యంతో మృతిచెందగా కుమారుడు రిత్విక్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె రిషిత ఇంజినీరింగ్‌ చదువుతోంది. వీరిద్దరూ తాత వెంకటేశ్వర్లు సంరక్షణలో ఉంటున్నారు. శ్రీనివాసులు కుమారుడు శ్రీకాంత్‌ సైతం బెంగళూరులోనే ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఆస్తుల విషయమై ఇంట్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆస్తి పంపకాలు సక్రమంగా జరగాలని రిత్విక్‌ గట్టిగా పట్టుబట్టారు.

ఈక్రమంలోనే రిత్విక్, శ్రీకాంత్‌ ఆదివారం చెన్నూరు నుంచి ఉద్యోగం నిమిత్తం వేర్వేరుగా బెంగళూరుకు వెళ్లిపోయారు. అక్కడ ఏంజరిగిందో తెలియదుగాని రిత్విక్‌ చనిపోయాడని చెన్నూరులోని తాత వెంకటేశ్వర్లుకు, బంధువులకు సోమవారం సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చారు. మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో బెంగళూరు పోలీసులు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. చెన్నూరులో అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో వాగ్వాదం నెలకొంది. ఆస్తి విషయమై రిత్విక్‌ను శ్రీకాంత్‌ నమ్మకంగా తీసుకెళ్లి బెంగళూరులోని అపార్ట్‌మెంట్‌ నుంచి కిందికి తోసివేయడంతోనే మృతిచెందాడని ఆరోపిస్తూ ఘర్షణకు దిగారు. గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తతల మధ్యనే అంత్యక్రియలు పూర్తిచేశారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని