logo

బాలలకేదీ సురక్ష..?

పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు.

Updated : 29 Mar 2024 05:07 IST

అయిదేళ్లుగా గాడిన పడని వైద్యసేవలు
న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు, పొదలకూరు  

విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం.. విద్యార్థుల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నామని పదేపదే చెబుతున్న పాలకులు విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ఉద్దేశించిన బాలల సురక్ష పథకాన్ని అటకెక్కించారు. ఐదేళ్లుగా పునరుద్ధరణ జరుగుతోందని ఆశించి ఎదురుచూస్తున్న బాలలు, తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. బాలల ఆరోగ్యం బాగుంటే భావితరం ఆరోగ్యంగా ఉన్నట్లేనని నిపుణులు పలుమార్లు చెబుతున్నా పట్టించుకునే వారే లేరు.

పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చిన్నతనంలోనే బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఏమైనా వ్యాధి లక్షణాలున్నట్లు గుర్తిస్తే తగిన చికిత్స అందించడానికి ముఖ్యమంత్రి బాలల సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి తెదేపా ప్రభుత్వం 2018 జూన్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అమల్లో కొన్ని బాలరిష్టాలను ఎదుర్కొన్న తరువాత సక్రమంగా కొనసాగింది. అప్పట్లో క్షేత్రస్థాయిలో 0 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలను ఇందులో చేర్చారు. ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్‌ కళాశాలల వరకు వారు వెళ్లి పరీక్షలు చేసి వివరాలు ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా కార్యక్రమాన్ని చేపట్టారు. బాలబాలికల్లో తరచూ వచ్చే సుమారు 30 రకాల వ్యాధులను, లక్షణాలను బట్టి తీవ్రతను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారు. పుట్టుకతో ఉన్నవి పెరుగుదలను బట్టి వచ్చే రకరకాలుగా వ్యాధులను స్ర్కీనింగ్‌ చేపట్టారు. నియోజకవర్గానికి మూడు వాహనాలు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనానికి ఇద్దరు వైద్యులు, ఇద్దరు ఏఎన్‌ఎంలను నియమించారు. సుమారు 17 వేల మందికి ఒక వాహనం ద్వారా వైద్యసేవలందించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి బృందం రోజుకు 120 మందిని పరీక్షించాలని లక్ష్యాలను నిర్దేశించారు.


అంతా కనుమరుగు..

నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా క్షేత్రస్థాయిలో పరీక్షలు బాగానే జరిగాయి. వ్యాధుల గుర్తింపు, నిర్ధారణ బాగా చేశారు. పథకంతో వేలాది మంది బాలలు ప్రయోజనం పొందారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు పథకం బాగానే కొనసాగింది తరువాత అటకెక్కింది. దీంతో వాహనాలు రాకపోవడంతో బాలలకు పరీక్షలు నిలిచిపోయాయి. వాహనాల్లో తిరిగి వైద్య సేవలందించిన సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేదని అప్పట్లో వాపోయారు.

 


వాహనాలు ఆగినా పరీక్షలు చేస్తున్నాం

-డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, ఆర్‌బీఎస్‌కే జిల్లా సమన్వయకర్త

బాలసురక్ష వాహనాలు ఆగిపోయిన మాట వాస్తవమే. కొన్ని సమస్యలతో నిలిచాయి. అయినప్పటికీ రాషీˆ్ట్రయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా మా పరిధిలో వీలున్నంత వరకు బాలల ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యాధికారి పర్యవేక్షణలో ప్రతి గురువారం ఐరన్‌ మాత్రలు ఏఎన్‌ఎంలు దగ్గరుండి వేయిస్తున్నారు. వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఆనారోగ్యం కలిగినా వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో సంప్రదిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని