logo

మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు

పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్‌లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్‌లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు.

Published : 18 Apr 2024 03:19 IST

అందుబాటులో సాంకేతిక విద్య
పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

న్యూస్‌టుడే, నెల్లూరు (విద్య): పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్‌లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్‌లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ విద్యను డిప్లొమా స్థాయిలో విద్యార్థులకు అందిస్తోంది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇందుకు అర్హులు. మూడన్నరేళ్ల వ్యవధిలో బయోమెడికల్‌, రెండేళ్ల వ్యవధిలో డీ ఫార్మసీ మినహా సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ, ఈసీఈ, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, సీసీపీ ఇలా మూడేెళ్ల కోర్సులు, డీసీఈ, డీఎంఈ తదితర డిప్లొమా కోర్సులకు మూడేళ్ల వ్యవధి ఉంటుంది.

పెరిగిన ఆదరణ

ప్రస్తుతం పాలిటెక్నిక్‌ కోర్సులకు ఆదరణ పెరిగింది. మూడు సంవత్సరాల కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఏడాది ప్రత్యేక ప్లేస్‌మెంట్‌ కార్యక్రమంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, పాలిసెట్‌ నిర్వహణ కన్వీనర్‌ విజయకుమార్‌ పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఉపాధి పొంది ఆర్థికంగా నిలబËడొచ్చని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. జిల్లాలో నెల్లూరు, కావలి, ఆత్మకూరు, కందుకూరులో అయిదు ప్రభుత్వ, ఆరు ప్రైవేటు కళాశాలలు ఉండగా.. వీటిలో వివిధ కోర్సుల్లో దాదాపు మూడు వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

బంగారు భవిత

విజయకుమార్‌, పాలిసెట్‌ జిల్లా కన్వీనర్‌

విద్యార్థులకు మూడేళ్లలో చదువుతోపాటు ఉపాధి అవకాశాలు లభించేది కేవలం పాలిటెక్నిక్‌లోనే. పదో తరగతిలో మంచి మార్కులు, పాలిసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధిస్తే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.

అయిదు కళాశాలల్లో ఉచిత శిక్షణ

జిల్లా వ్యాప్తంగా అయిదు ప్రభుత్వ, ఆరు ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్ష పాలిసెట్‌-24కు సిద్ధమవుతున్నారు. వీరికి ఈనెల 27న పాలిసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది పాలిటెక్నిక్‌కు సిద్ధమవుతున్న విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉచిత శిక్షణను జిల్లాలోని అన్ని ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని