logo

సైనికపల్లెలు

సైన్యంలో చేరడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ఆ యువకులు. సొంతూరికి పేరు తీసుకురావడంతో పాటు దేశసేవలో పాల్గొనడానికి మించిన ఆనందం మరొకటి లేదని చాటుతున్నారు. సరిహద్దుల్లో సేవలందిస్తున్న  సీనియర్లను స్ఫూర్తిగా తీసుకొని అదే

Published : 15 Jan 2022 03:16 IST

నేడు ఆర్మీ దినోత్సవం

సైన్యంలో చేరడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ఆ యువకులు. సొంతూరికి పేరు తీసుకురావడంతో పాటు దేశసేవలో పాల్గొనడానికి మించిన ఆనందం మరొకటి లేదని చాటుతున్నారు. సరిహద్దుల్లో సేవలందిస్తున్న  సీనియర్లను స్ఫూర్తిగా తీసుకొని అదే తోవలో వెళ్తున్నారు ఉమ్మడి జిల్లాలోని మూడు గ్రామాల వాసులు. నేడు ఆర్మీ దినోత్సవం సందర్భంగా వారిపై పరిచయ కథనం.
ప్రస్తుతం జిల్లా నుంచి సేవలందిస్తున్న సైనికులు: 2800
విశ్రాంత సైనికులు: 650


చిమన్‌పల్లి..
సిరికొండ :   ఒకప్పుడు అన్నల తుపాకుల చప్పుళ్లతో తెల్లవారిన ఆ పల్లె ప్రస్తుతం దేశానికి సైనికులను అందిస్తోంది. పరిస్థితులు అనుకూలించకున్నా సిరికొండ మండలం చిమన్‌పల్లి యువకులు కఠోర శ్రమతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఆసక్తిగల వారికి దిశానిర్దేశం చేస్తూ ఆర్మీలో చేరేందుకు దోహదపడుతున్నారు. ఇప్పటి వరకు 30 మంది దేశ  రక్షణలో భాగం కావడం ఆనందంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.


నేతాజీ స్ఫూర్తితో..
తాడ్వాయి : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ గురించి గ్రామస్థులకు తెలియాలనే ఉద్దేశంతో తాడ్వాయికి చెందిన విశాంత్ర ఉపాధ్యాయుడు ఆకుల పిచ్చయ్య, వడ్ల బ్రహ్మంతోపాటు మరికొందరు 40 ఏళ్ల క్రితం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల విజయాలపై ప్రదర్శనలు సైతం ఇచ్చారు. ఆ మహనీయుల స్ఫూర్తితో కాలక్రమేణా 25 మంది సైన్యంలో చేరారు. సుర్కంటి సతీష్‌రెడ్డి, గుట్టకాడి సంజీవ్‌రెడ్డి, ఆకిటి ప్రశాంత్‌రెడ్డి, కమ్మరి నవీన్‌, పీసు సంజీవ్‌రెడి,్డ సాయిరాంగౌడ్‌, ప్రదీప్‌రావు ఇలా మరికొందరు శ్రీనగర్‌, పంజాబ్‌ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారందరూ కలిసి 2019లో మరోసారి నేతాజీ విగ్రహాన్ని నెలకొల్పారు.


మొదటి ప్రయత్నంలోనే సాధించా
రవి, మామిడిపల్లి

ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఆర్మీలో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. పదోతరగతి పూర్తికాగానే గతంలోనే ఎంపికైన సీనియర్‌ జవాన్ల సలహాలతో సాధన చేశాను. 2005లో ఖమ్మంలో జరిగిన సెలక్షన్‌లో పాల్గొని మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం శ్రీనగర్‌ సరిహద్దులో పని చేస్తున్నాను. దేశానికి సేవ చేయడం సంతోషంగా ఉంది.


మామిడిపల్లి..
ఆర్మూర్‌ గ్రామీణం: మామిడిపల్లి నుంచి చంద్రశేఖర్‌ అనే వ్యక్తి తొలుత 1999లో సైన్యానికి ఎంపికయ్యారు. అనంతరం నాలుగేళ్లకు కాలేవర్‌ రాజు అదే తోవలో పయనమయ్యారు. నాసిక్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందారు. వారి నుంచి స్ఫూర్తి పొందిన పలువురు దేశ రక్షణలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటివరకు దేవేందర్‌, సాయికుమార్‌, రవీందర్‌, సురేశ్‌, జానకీరాం, రవీందర్‌, చంద్రశేఖర్‌, శ్రీకాంత్‌, అనిల్‌, నవీన్‌, రాజు, విక్రం, బాల్‌రాజు, రవి ఇలా 20 మంది వరకు చేరారు.


ఎంపికలు  ఇలా..
సైన్యంలో ఎంపికల కోసం ఆర్మీ ర్యాలీలు నిర్వహిస్తారు. రెజిమెంట్లలోని ఖాళీలకు అనుగుణంగా ఏటా రెండు నుంచి నాలుగు సార్లు ర్యాలీలు నిర్వహిస్తారు. ఎక్కువగా సికింద్రాబాద్‌, కరీంనగర్‌లో జరుగుతుంటాయి. రెండేళ్ల క్రితం నిజామాబాద్‌లోని నాగారంలో నిర్వహించారు. శారీరక దృఢత్వంతో పాటు రాత పరీక్ష, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా ఎంపికలు చేస్తారు.


దేశం కోసం ప్రాణాలర్పించి..
కోమన్‌పల్లి(వేల్పూర్‌) : కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్‌ దేశం కోసం ప్రాణాలర్పించారు. ర్యాడ గంగమల్లు, రాజుల చిన్న కుమారుడైన ఆయన చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో ముందుకు సాగారు. 2014 డిసెంబరులో ఆర్మీలో చేరారు. 2020 నవంబరు 8న జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా వద్ద ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునే క్రమంలో అమరుడయ్యారు.


అదృష్టంగా భావిస్తున్నా
- సంజీవ్‌రెడ్డి

పది సంత్సరాల క్రితం సైన్యంలో చేరాను. దేశానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో పని చేస్తున్నాను. నాతో పాటు తాడ్వాయికి చెందిన 20 మంది యువకులు చేరారు.


యువకులు ముందుకు రావాలి
రమాకాంత్‌, మద్దికుంట

రామారెడ్డి : సైన్యంలో చేరాలని చిన్నతనంలోనే నిర్ణయించు కున్నాను. కష్టపడి చదివి 2016లో ఉద్యోగం సాధించాను. నాగ్‌పూర్‌లో శిక్షణ పొందాను. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాను. ఆర్మీలో చేరేందుకు యువకులు ముందుకు రావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని