logo

ముగిసిన నామినేషన్ల పర్వం

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది.

Published : 26 Apr 2024 05:35 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పత్రాలు స్వీకరించారు. చివరి రోజు గురువారం ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేష్‌రెడ్డిలతో కలిసి భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతుకు అందజేశారు. మీసాల శ్రీనివాస్‌రావు తన భార్య కార్పొరేటర్‌ సవితతో భాజపా తరఫున నామినేషన్‌ వేశారు. చివరి రోజున 28 నామినేషన్లు దాఖలయ్యాయి.

42 మంది.. 90 సెట్లు

నామినేషన్ల గడువు ముగిసే వరకు 42 మంది అభ్యర్థులు 90 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. భాజపా, కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు ధర్మపురి అర్వింద్‌, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఇతర పార్టీల వారు, స్వతంత్రులు నామినేషన్‌ వేశారు. నామినేషన్ల సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అనుమతి లేకుండా ఎవరిని లోపలికి పంపించలేదు.

నేడు పరిశీలన

నామినేషన్లను అధికారులు శుక్రవారం పరిశీలిస్తారు(స్క్రూటినీ చేస్తారు). పొరపాట్లు ఉంటే వాటిని తిరస్కరిస్తారు. ఇందుకు గల కారణాలను అభ్యర్థులకు తెలియజేస్తారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంత మంది బరిలో ఉన్నారో తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని