logo

కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి

కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఓటర్లను కోరారు.

Published : 26 Apr 2024 06:17 IST

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ 

ప్రసంగిస్తున్న ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ, పక్కన అర్వింద్‌

ఈనాడు, నిజామాబాద్‌ : కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఓటర్లను కోరారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్‌ వచ్చిన ఆయన, అనంతరం జరిగిన విజయ సంకల్ప్‌ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పాలనలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని..అవినీతి లేకుండా పాలన సాగిస్తున్న భాజపాపై రాజకీయ దాడి చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆ పార్టీ, భారాసతో లోపాయికారి ఒప్పందంలో భాగంగా మెత్తపడిందన్నారు. మోదీ పదేళ్ల పాలనలో 50 కోట్ల మంది దారిద్య్రరేఖను దాటి బయటకు వచ్చారన్నారు. అన్నివర్గాల సంక్షేమమే తమ విధానమన్నారు. ఈ ప్రాంత రైతులు 40 ఏళ్లుగా చేస్తున్న పసుపుబోర్డు పోరాటాన్ని మోదీ అర్థం చేసుకొని ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారన్నారు. చక్కెర కర్మాగారాల అంశాన్ని స్థానిక ఎంపీ అర్వింద్‌ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని పేర్కొన్నారు.

ఇందూరు గడ్డమీదే పసుపుబోర్డు

పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేసే బాధ్యత తనదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పష్టం చేశారు. సభలో ఆయన ప్రసంగిస్తూ గత ఎన్నికల సమయంలో తానిచ్చిన అన్ని హామీలను నెరవేర్చానని చెప్పారు. మాధవనగర్‌ రైల్వే వంతెన సహా.. మరో ఆరు వంతెనల నిర్మాణం కోసం కృషి చేసినట్లు చెప్పారు. రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు అంశం ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతానికి ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు. పట్టభద్రుల ఓట్లతో గెలిచి.. ఉద్యోగాల భర్తీ, పోటీ పరీక్షల లీకేజీ అంశాలపై పోరాడలేదన్నారు. జీవన్‌రెడ్డి కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక పసుపు బోర్డు తెస్తారని రేవంత్‌రెడ్డి చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పసుపు బోర్డు అంశం వ్యవసాయ శాఖ పరిధిలో ఉండదని... అది వాణిజ్యశాఖ పరిధిలో ఉంటుందని కాంగ్రెస్‌ నేతలకు తెలియదని ఎద్దేవా చేశారు. గల్ఫ్‌ బాధితుల కష్టాలు కాంగ్రెస్‌, భారాస ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. భాజపా అనుబంధ సంస్థ ఇండియా పీపుల్స్‌ ఫారం గల్ఫ్‌లో చిక్కుకుపోయిన భారతీయులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోతో హిందువుల్లో అభద్రత సృష్టిస్తోందని ఆరోపించారు. కేవలం మైనార్టీలను మాత్రమే ప్రోత్సహించేలా హామీలు ఇవ్వడం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. చక్కెర పరిశ్రమను వచ్చే ఏడాది డిసెంబరు కల్లా తెరుస్తామని ప్రభుత్వం నియమించిన కమిటీ అంటుంటే.. ఈ సెప్టెంబరులోనే తెరుస్తామని రేవంత్‌రెడ్డి చెప్పటం నమ్మశక్యంగా లేదన్నారు. మోదీ హయాంలో రైల్వే లైన్లు, జాతీయ రహదారులు ఎంతో అభివృద్ధి చెందాయని.. రానున్న రోజుల్లో మరింత ప్రగతిని సాధిస్తామని చెప్పారు. జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.

వేదికపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌,
ఎంపీ ధర్మపురి అర్వింద్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌, రాకేశ్‌రెడ్డి, నాయకులు పల్లె గంగారెడ్డి, మోహన్‌రెడ్డి, బోగ శ్రావణి, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి తదితరులు

ఇతర మతాల దేవుళ్లపై ప్రమాణం చేయాలి

ఇచ్చిన హామీలు అమలు చేయమంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లపై ప్రమాణం(ఒట్టు) వేస్తున్నారని ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే ఇతర మతాల దేవుళ్లపై ఒట్లు వేయాలన్నారు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామన్నారు. అమాయక హిందువులను మోసం చేయటం కోసం కాంగ్రెస్‌ నేతలు, ముఖ్యమంత్రి ఒట్లు వేస్తున్నారన్నారు. ఓట్ల కోసం అందరూ కాషాయ వస్త్రాలు ధరిస్తున్నారని.. కానీ హిందుత్వం అనేది గుండెల్లో ఉండాలన్నారు. అయోధ్య బాలరాముడిని మదిలో తలుచుకుంటూ.. భాజపాకు ఓటు వేయాలన్నారు.

హామీల అమల్లో కాంగ్రెస్‌ విఫలం

ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ విమర్శించారు. రుణమాఫీ ఆగస్టు 15కు వాయిదా వేయటమంటే.. అప్పటికల్లా పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగుస్తాయనే దురాలోచనతో చేస్తున్న పనిగా పేర్కొన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో భాజపా బలంగా ఉందని.. ఇక్కడ అత్యధిక మెజార్టీతో అర్వింద్‌ గెలవటం ఖాయమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌కు ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బహిరంగ సభలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, ఉత్తరాఖండ్‌ మంత్రి వినయ్‌ రోహెలా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, వెంకటరమణి, పార్టీ నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు దినేష్‌ కులాచారి, సత్యనారాయణ, నాయకులు మేడపాటి ప్రకాష్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి, లోక భూపతిరెడ్డి, గద్దె భూమన్న, భోగా శ్రావణి, స్రవంతిరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

బహిరంగ సభకు హాజరైన ప్రజలు, కార్యకర్తలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు