logo

వలసలతో పరేషాన్‌..!

కాంగ్రెస్‌లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated : 28 Mar 2024 04:51 IST

ఈనాడు, కామారెడ్డి

కాంగ్రెస్‌లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌ ఓటమికి యత్నించి ప్రస్తుతం అధికారం పోగానే చేరుతున్న భారాస నాయకుల తీరును తప్పుపడుతున్నారు. క్షేత్రస్థాయి బలోపేతం పేరుతో ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను ఆహ్వానించడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. తమకు వచ్చే పదవులు వీరు ఎగురేసుకుపోతారేమోననే భయంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో సీనియర్లు

జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌లో భారాస నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్‌  సీనియర్‌ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. రామారెడ్డి మండలంలో సైతం పార్టీని విడిచిపెట్టి పోయిన నేతలు మళ్లీ రావడాన్ని కార్యకర్తలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బీర్కూర్‌లో భారాసకు చెందిన మాజీ ప్రజాప్రతినిధిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవద్దంటూ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాచారెడ్డి, కామారెడ్డి పట్టణ పరిధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీలోకి తీసుకోవడంపై సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగా అసమ్మతి ప్రకటించకపోయినా.. అంతర్గత సమావేశాల్లో పార్టీ ముఖ్యనేతల వైఖరిని ఎండగడుతున్నారు. వలస వచ్చిన నేతలే పార్టీ కార్యక్రమాల్లో హడావుడి చేయడాన్ని ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్న కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం భారాస నుంచి వచ్చిన వలస నేతలే పెత్తనం చెలాయిస్తున్నారని పార్టీ కార్యకర్తలు అదిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.


ప్రకటనలకే పరిమితం

స్థానిక నేతలు, కార్యకర్తల సమ్మతితోనే చేరికలు ఉంటాయని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. సీనియర్‌ కార్యకర్తలు, ముఖ్యనేతలకు ఏమాత్రం చెప్పకుండా కండువా కప్పేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పి సరిపెడుతున్నారు. వలస నేతలు ఆర్థికంగా ఉండడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్టు ఎక్కడ  ఎగురేసుకుపోతారో అనే ఆందోళన సీనియర్‌ నేతల్లో కనబడుతోంది. కామారెడ్డి నియోజకవర్గంలో నియామక పదవులు సైతం వలస నాయకులకే దక్కేలా కనపడుతున్నాయి. పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు నియోజకవర్గానికి పార్టీ పరంగా ఇన్‌ఛార్జిని నియమించలేదు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌ అర్బన్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గ పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుగా అటు పాలన బాధ్యతల ఒత్తిడి కారణంగా నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కాంగ్రెస్‌ ప్రకటించిన నియామక పదవుల్లో నియోజకవర్గం నుంచి ఒక్కరికి స్థానం కల్పించకపోవడంతో సీనియర్‌ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని