logo

ఆభరణాలు స్వాధీనం: అయిదుగురి అరెస్టు

గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు.

Published : 28 Jan 2023 02:04 IST

స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులతోపాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానానికి తరలించామని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్‌ ఎం. సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన 162 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బ్రహ్మపుర సదర్‌ ఠాణా పరిధిలోనూ నిందితులు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని, దానిపైనా వారిని రిమాండులోకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. గొళంత్రా పట్టణానికి చెందిన కాళు ప్రధాన్‌ (72) అనే వృద్ధుడి తాళం వేసి ఉన్న ఇంట్లో నిరుడు డిసెంబరు 22వ తేదీ రాత్రి చోరీ జరిగింది. ఇంటి తాళాలు విరిచి, అల్మరాలు తెరిచి అందులో భద్రపరిచిన 20 తులాల బంగారం ఆభరణాలు, రూ.10 లక్షల నగదు చోరీకు గురైనట్లు బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి బ్రహ్మపుర, పట్టపూర్‌, దిగపొహండి, భువనేశ్వర్‌లకు చెందిన నిందితుల్ని పట్టుకున్నామని ఎస్పీ ఆ ప్రకటనలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని