logo

అమాత్య అనుగ్రహం ఉంటుందా..?

యూపీఏ పాలనలో రాష్ట్ర రైల్వే రంగం పరిస్థితి తీసికట్టుగా అయింది. 2019లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి.

Published : 01 Feb 2023 03:50 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: యూపీఏ పాలనలో రాష్ట్ర రైల్వే రంగం పరిస్థితి తీసికట్టుగా అయింది. 2019లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి. గతేడాది రూ.10వేల కోట్లు విడుదల చేశారు. తూర్పు భారత రాష్ట్రాల్లో ఒడిశాకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యమిచ్చారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఉటంకించిన సంగతి విదితమే. ఇది వరకు నత్తనడకన సాగిన ప్రాజెక్టు పనులు పుంజుకుంటున్నాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదని పేర్కొన్నారు.

వ్యాగన్ల తయారీ ఊసే లేదు

యూపీఏ పాలనా కాలంలో నాటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ గోపాల్‌పూర్‌ పరిధిలోని శితలాపల్లిలో రైలు వ్యాగన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వందెకరాల స్థలం కేటాయించినా ఇంతవరకు పనుల ఊసులేదు. తర్వాత కలహండి జిల్లాలోని భవానీపట్నం సమీపంలో మరో వ్యాగన్ల కేంద్రం ఏర్పాటు చేస్తామని దిల్లీ పెద్దలు ప్రకటించినా అమలుకి నోచుకోలేదు. గోపాల్‌పూర్‌-సంబల్‌పూర్‌ రైల్వే లైను నిర్మాణానికి సర్వే పనులు పదేళ్ల క్రితం పూర్తయినా గ్రహణం వీడలేదు. పరదీప్‌-హరిదాస్‌పూర్‌, అనుగుల్‌-సుకింద, ఖుర్ధా-బొలంగీర్‌ రైల్వే ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

రాష్ట్రానికి ప్రాతినిధ్యం

రాజ్యసభకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గతంలో ఐఏఎస్‌ అధికారి. ఒడిశాలో కీలక శాఖల్లో విధులు నిర్వహించారు. అవసరాలు, ఇబ్బందులు తెలుసు. పారిశ్రామిక రంగం విస్తరిస్తున్న తరుణంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు కీలకమైన నేపథ్యంలో అశ్వినీ ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం చేస్తారని అంతా ఆశాభావంతో ఉన్నారు.

32 స్టేషన్ల ఆధునికీకరణ

పూరీ, భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్లకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తామని, ఆధునికీకరణ, విస్తరణ పనులు ప్రారంభించామని అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. పూరీలో నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. భువనేశ్వర్‌ పరిస్థితి మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. భువనేశ్వర్‌-కటక్‌ జంట నగరాల మధ్య మెట్రో రైలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని