ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు వేళాయె

ఆదర్శ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Updated : 04 Jun 2022 03:41 IST

కొత్తవలస, భామిని, న్యూస్‌టుడే: ఆదర్శ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 33 ఆదర్శ పాఠశాలలున్నాయి. వీటిలో బాలబాలికలకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. గతంలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో నాలుగు గ్రూపుల్లో 20 చొప్పున 80 సీట్లు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఒక్కో గ్రూపులో 40 చొప్పున 160 మందికి అవకాశం ఉంది. ఇక ఒక్కో పాఠశాలకు 6వ తరగతిలో 80 నుంచి 100కు సీట్లు పెంచారు. ఈ నెల 5 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు దూరం నుంచి వచ్చే బాలికలకు వసతిగృహం సదుపాయం ఉంది. వీరికి ధ్రువపత్రాల ఆధారంగా అవకాశం కల్పిస్తారు.  పూర్తి వివరాలకు సంబంధిత ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్, జిల్లా విద్యాశాఖాధికారి/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించొచ్చు. 

ఇంటర్మీడియట్‌కు.. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన వాటిల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేయడానికి ముందుగా సమాచారం కోసం https://apms.ap.gov.in/apms//చూడాలని అధికారులు సూచించారు. ఇందులో అర్హత పరిశీలించి సంతృప్తి చెందితే ఈనెల 5 నుంచి 16 వరకు నెట్‌ బ్యాంకింగ్‌/క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను ఉపయోగించి దరఖాస్తు రుసుము చెల్లిస్తే వారికి ఒక జనరల్‌ నంబరు కేటాయిస్తారు. దీని ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీలు రూ.150, ఎస్సీ, ఎస్టీలు రూ.100 చెల్లించాలి.

6వ తరగతికి.. 6వ తరగతిలో ప్రవేశానికి  ఓసీ, బీసీ విద్యార్థులైతే 2010 సెప్టెంబరు 01, 2012 ఆగస్టు 08 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారైతే 2008 సెప్టెంబరు 1, 2012 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2020-22 కాలంలో చదవాలి. 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్‌ అర్హత  పొందడం తప్పనిసరి. ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు నెట్‌ బ్యాంకింగ్‌/క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను ఉపయోగించి దరఖాస్తు రుసుము చెల్లిస్తే జనరల్‌ నంబరు కేటాయిస్తారు. దీని ఆధారంగా https://apms.ap.gov.in/apms/   ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 దరఖాస్తు రుసుము చెల్లించాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని