logo

ఖాతాలన్నారు.. కాజేశారు

కూలి పనులు చేసుకునే వారికి మాయమాటలు చెప్పి మోసం చేసిందో ప్రైవేటు పొదుపు సంస్థ. 

Updated : 29 Nov 2022 07:07 IST

ప్రైవేటు పొదుపు కార్యాలయం టోకరా
ఆందోళనలో ఖాతాదారులు

కార్యాలయం బోర్డు ఎత్తేశారిలా..

పాలకొండ/గ్రామీణం, న్యూస్‌టుడే: కూలి పనులు చేసుకునే వారికి మాయమాటలు చెప్పి మోసం చేసిందో ప్రైవేటు పొదుపు సంస్థ.  పాలకొండ ప్రధాన రహదారిలోని నాగవంశంవీధి కూడలిలో నాలుగేళ్ల కిందట ముద్రా అగ్రికల్చర్‌, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ మల్టీస్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ పేరిట  కార్యాలయాన్ని పెట్టింది. పలువురు సిబ్బందిని నియమించి రోజువారీ, నెలవారీ పొదుపు ఖాతాలను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా ప్రచారం చేయడంతో ప్రజలు సైతం నమ్మకంగా ఖాతాలు తెరిచారు. సభ్యత్వం తీసుకున్న వారికి రుణ సదుపాయం ఇస్తామని చెప్పడంతో ఎక్కువ మంది వ్యాపారులు, చిరు వ్యాపారులు, సామాన్యులు, రోజువారీ కూలీలు చేరారు. ఏడాది కాల పరిమితితో 8.33 శాతం వడ్డీ, రెండేళ్లకు పది శాతం, 60 నెలలైతే 11 శాతమంటూ ఆకర్షణీయమైన ప్రకటనలిచ్చారు.

ఏడాదిగా మూత : పాలకొండతో పాటు సమీప మండలాలకు చెందిన వందలాది మంది ఈ సంస్థలో పొదుపు చేశారు. కొందరు రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు కట్టినట్లు సమాచారం. ప్రారంభంలో కొందరికి బాగానే డబ్బులిచ్చి నమ్మించారు. రెండేళ్ల అనంతరం     ఆపేశారు. బాధితులు నిలదీయగా.. డబ్బులిస్తామని చెప్పారు. ఏడాదిగా కార్యాలయాన్ని మూసేశారు.   వసూళ్లకు వచ్చిన సిబ్బంది కూడా మాయమయ్యారు. చరవాణులు కూడా స్పందించడం లేదు. ఈక్రమంలో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు   సిద్ధమవుతున్నారు.


ఫిర్యాదులు అందలేదు

సంస్థపై ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పట్టణ ఎస్సై బి.శివప్రసాద్‌ తెలిపారు. ఖాతాదారులు ముందుకొస్తే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.


ఆందోళనగా ఉంది ..

నాగవంశంవీధి కూడలిలో నేను కొబ్బరి బొండాలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. సమీపంలో ముద్రా పేరిట సంస్థ తెరవడంతో తెలిసిన వారి ద్వారా ఖాతా తెరిచాను. రూ.18 వేల వరకు కట్టాను. కొన్ని రోజులుగా కార్యాలయానికి వెళ్తుంటే మూసి ఉంటుంది. ఏం చేయాలో తెలియడం లేదు.

బి.సూరి, చిరువ్యాపారి


నమ్మించారు..

కేంద్ర ప్రభుత్వ సంస్థగా నమ్మించారు. దీంతో 207 రోజులు పాటు రోజుకు 200 చొప్పున చెల్లించాను. ప్రస్తుతం ఆ కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేరు. ఫోన్లు సైతం పనిచేయడం లేదు. నా స్నేహితులు కూడా ఇందులో చేరారు.

పి.రమేష్‌, వ్యాపారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని