logo

రోడ్లు లేవు.. సేవలూ కానరావు

రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్‌ కమిటీలు ఆదాయ వనరుగానే మిగిలాయి. చెక్‌పోస్టుల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీస సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది.

Published : 29 Mar 2024 04:29 IST

ఏఎంసీలకు ఆదాయమే లక్ష్యమా!!

పాలకొండలో అధ్వానంగా గోదాములు

పాలకొండ, న్యూస్‌టుడే: రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్‌ కమిటీలు ఆదాయ వనరుగానే మిగిలాయి. చెక్‌పోస్టుల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీస సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది.

మన్యం జిల్లాలో పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాంలో మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. సెస్సుల రూపంలోనూ వస్తోంది. పార్వతీపురం మార్కెట్‌ కమిటీ ద్వారా రూ.4.64 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1.98 కోట్లు, సాలూరులో రూ.2.79 కోట్లకు రూ.2.28 కోట్లు, కురుపాంలో రూ.2.14 కోట్లకు రూ.1.29 కోట్లు, పాలకొండలో రూ.2.51 కోట్లకు రూ.2.08 కోట్లు  వసూలైంది.

గతంలో మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించేవారు. ఇందుకు రూ.20 వేలు వ్యయం చేసేవారు. గ్రామాల్లో ఉన్న రైతుల మూగజీవాలు రోగాలు బారిన పడితే పట్టణ ప్రాంతాలకు తరలించకుండా గ్రామాలకే వెళ్లి వైద్యసేవలు అందించేవారు. 2020 నుంచి వైద్య శిబిరాలు ఆగాయి.

పొలానికి వెళ్లేది ఎలా?

పొలాల నుంచి పంటలు రవాణా చేసేందుకు అనువుగా ఏఎంసీల ఆధ్వర్యంలో లింకురోడ్లు నిర్మించేవారు. ప్రస్తుతం ఇవీ కానరావడం లేదు. కొన్నేళ్ల కిందట ప్రతిపాదించినా నేటికీ అమలుకు నోచుకోలేదు. జిల్లాలోని నాలుగు మార్కెట్‌ కమిటీల పరిధిలో ఏడు ప్యాకేజీలుగా పనులు విభజించారు. 54 పనుల్లో భాగంగా 160 కిలోమీటర్ల మేర రహదారులు మెరుగుపర్చేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రూ.33.76 కోట్లు వ్యయం చేసేందుకు అంచనాలు వేశారు. ప్రతిపాదనలు చేసి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోలేదు. పంచాయతీరాజ్‌ అధికారుల ఆధ్వర్యంలో పలుమార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో ఈ పనులు నాబార్డు ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. నేటికీ రహదారులు మాత్రం మెరుగుపడలేదు. జిల్లాలోని ఏఎంసీల పరిధిలో 29 గోదాములు ఉన్నాయి. వీటి సామర్థ్యం 19,760 టన్నులు. ఇందులో తొమ్మిది గోదాములు మరమ్మతులకు గురయ్యాయి.


లింకు రోడ్లకు ప్రతిపాదించాం
- ఎల్‌.అశోక్‌, ఏడీ మార్కెటింగ్‌ శాఖ

జిల్లాలో మార్కెట్‌ కమిటీల పరిధిలో లింకురోడ్లకు ప్రతిపాదించాం.పంచాయతీరాజ్‌ అధికారుల పర్యవేక్షణలో ఇవి ఉన్నాయి. పశు వైద్య శిబిరాలకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని