logo

మన్యం కుర్రోడు సివిల్స్‌ కొట్టాడు

మన్యంలో అతనిదో మారుమూల ప్రాంతం.. అక్కడే విద్యాభ్యాసం. పది పాసైన తర్వాత సివిల్స్‌లో చేరాలని కలలుగన్నారు.

Published : 17 Apr 2024 04:56 IST

తల్లిదండ్రులు వెంకటరత్నం, విజయ్‌కుమార్‌తో పృథ్వీరాజ్‌కుమార్‌
పార్వతీపురం, న్యూస్‌టుడే  మన్యంలో అతనిదో మారుమూల ప్రాంతం.. అక్కడే విద్యాభ్యాసం. పది పాసైన తర్వాత సివిల్స్‌లో చేరాలని కలలుగన్నారు. అనుకున్నదే తడవుగా ప్రణాళికలు అమలు చేశారు. లక్ష్యం చేరుకునే క్రమంలో రెండుసార్లు ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గకుండా అడుగులు ముందుకు వేశారు. మూడో ప్రయత్నంలో జాతీయస్థాయిలో 493 ర్యాంకుతో ప్రతిభ చాటారు కురుపాంకు చెందిన 23 ఏళ్ల దొనక పృథ్వీరాజ్‌కుమార్‌ జిల్లా యువతకు ఆదర్శంగా నిలిచారు.

తల్లిదండ్రులే ఆదర్శం..

 పృథ్వీరాజ్‌కుమార్‌ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి విజయ్‌కుమార్‌  పార్వతీపురం మండలంలోని ఎమ్మార్‌నగర్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి వెంకటరత్నం అదే పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం కురుపాంలోనే పృథ్వీరాజ్‌కుమార్‌ ప్రాథమిక విద్యను అభ్యసించారు. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా పార్వతీపురం రావడంతో పదో తరగతి  ఓ ప్రైవేటు పాఠశాలలో పూర్తి చేశారు. అమ్మానాన్నను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని భావించారు. సివిల్స్‌ లక్ష్యంగా చేసుకొని ఇంటర్మీడియట్‌లో   హెచ్‌పీజీ(హిస్టరీ, పాలిటిక్స్‌, జాగ్రఫీ) గ్రూపు తీసుకున్నారు. సాంఘికశాస్త్ర అంశాలతో డిగ్రీని హైదరాబాద్‌లో పూర్తి చేసి అక్కడే ఐఏఎస్‌ అకాడమీలో శిక్షణ పొందారు.

 రోజూ ఎనిమిది గంటలు..

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ను ప్రధానాంశంగా ఎంచుకున్న పృథ్వీరాజ్‌ తొలి ప్రయత్నం విఫలమయ్యారు. రెండో సారి రాసిన పరీక్షలో భాగంగా గతేడాది ముఖాముఖి వరకు వెళ్లినా సరైన ఫలితం రాలేదు. మూడోసారి మెరుగైన ర్యాంకుతో సత్తా చాటారు. తన తండ్రి విధానాలు, ఆయనలోని నైపుణ్యాలను చూసి అఖిల భారత స్థాయిలో పరీక్షలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్లు పృథ్వీరాజ్‌కుమార్‌ తెలిపారు. రోజుకు 8 గంటలు ప్రణాళికతో చదివానని, మూడోసారి ముఖాముఖిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పారు. అక్క పూజిత సహకారం, తల్లిదండ్రుల దిశానిర్దేశంతో సన్నద్ధమైనట్లు చెప్పారు. విద్యావ్యవస్థ మెరుగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పృథ్వీరాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. కురుపాం నుంచి మొట్టమొదట సివిల్స్‌ సాధించిన యువకుడిగా తమ కుమారుడు నిలవడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు విజయ్‌కుమార్‌, వెంకటరత్నం ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం తమ జీవితాశయాన్ని తీర్చిందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు