logo

విద్యుత్తు సిబ్బంది ఏరీ.. ఎక్కడ!

క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన విద్యుత్తు అధికారులు, సిబ్బంది పోస్టులు గత ఎనిమిదేళ్లుగా భర్తీ కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో చిన్నపాటి అంతరాయం కలిగినా పరిష్కరించేవారు కరవయ్యారు. లైన్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉండటం

Published : 20 May 2022 02:02 IST

ఏళ్లతరబడి భర్తీకాని పోస్టులు 
గ్రామాల్లో సేవలందించేవారే కరవు

* కొత్తపట్నం మండలం మడనూరులో ఉప్పుగాలుల తీవ్రతకు విద్యుత్తు స్తంభంపై ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. వాటి నిర్వహణపై సిబ్బంది పట్టించుకోలేదు. మహాశివరాత్రి సందర్భంగా జరిగిన తిరునాళ్ల సమయంలో రథం స్తంభం తగలడంతో పైన ఉన్న పలకలు ఓ మహిళ తలపై పడ్డాయి. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన విద్యుత్తు అధికారులు, సిబ్బంది పోస్టులు గత ఎనిమిదేళ్లుగా భర్తీ కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో చిన్నపాటి అంతరాయం కలిగినా పరిష్కరించేవారు కరవయ్యారు. లైన్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉండటం; మరోవైపు విధుల్లో ఉన్నవారు అప్పుడప్పుడైనా తనిఖీ చేయకపోవడం చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒక్కో ఉద్యోగి ఇతర ప్రాంతాలకు ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహించడం వల్ల సకాలంలో సేవలు అందించడంలోనూ ఇబ్బందే. స్థానికులే కొద్దిపాటి అవగాహనతో ఎలక్ట్రీషియన్‌గా మారి విద్యుత్‌ పరివర్తకాల వద్ద ఫ్యూజు వేయడం లేదా లైన్‌ మీద మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తున్నారు. తద్వారా అవగాహన లేమితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయ్‌..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం  లైన్‌మెన్‌ మాత్రమే స్తంభం ఎక్కాలి. జూనియన్‌ లైన్‌మెన్, సహాయ లైన్‌మెన్‌ అనుసంధానంగా ఉండేవారు. 2001లో డిస్కంల ఆవిర్భావం తర్వాత నిబంధనలు సడలించారు. తద్వారా సహాయ లైన్‌మెన్‌ కూడా స్తంభం ఎక్కేలా మార్పులు చేశారు. సచివాలయాల ఎనర్జీ అసిస్టెంట్‌(జేఎల్‌ఎం-గ్రేడు 2) పోస్టులు మినహా 2014 నుంచి ఎలాంటి ఉద్యోగాల భర్తీ జరగలేదు. మార్గదర్శకాల ప్రకారం ఎనర్జీ అసిస్టెంట్‌ స్తంభం ఎక్కడానికి లేదు. అత్యవసర సమయంలో వారితో పని చేయించినా ఆ సమయంలో ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు అందుకు బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
గతంలో జేఎల్‌ఎం మీటరు రీడింగ్‌ తీయగా వారికి పనిభారం రీత్యా ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు. ఉద్యోగుల కొరతను దృష్టిలో ఉంచుకుని జూనియర్‌ లైన్‌మెన్, సహాయ లైన్‌మెన్‌కు రెండు లేదా మూడు గ్రామాల చొప్పున విద్యుత్తు సరఫరా నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. వినియోగదారుల నుంచే వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చాక ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేశారు. 638 సచివాలయాలకు మంజూరుకాగా, అందులో 629 మంది విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారు కూడా పనిచేసే చోట నివాసం ఉండకపోవడంతో పల్లెల్లో రాత్రివేళ ఫ్యూజ్‌ పోతే వేసేవారు కరవయ్యారు. వేసవిలో ఏసీల వినియోగం కారణంగా పరివర్తకంపై లోడు ఎక్కువ పడటంతో తరచూ ఫ్యూజులు పోతున్నాయి. స్థానికులే వీటిని వేస్తున్నారు.

* కంభం మండలం లింగాపురంలో ఇటీవల సయ్యద్‌ ఫాతిమా ఆరుబయట నిద్రించగా సమీపంలోని 11 కేవీ విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. బయట ఉన్నవారంతా పరుగులు తీయగా ఫాతిమా తమ మనవళ్ల కోసం వెతుకుతూ మంచంపై ఉన్న బొంతను తీశారు. ఆ క్రమంలో విద్యుత్తు తీగ తగిలి క్షణాల్లో ఆమె సజీవ దహనమయ్యారు. 

ప్రభుత్వానికి నివేదించాం
జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు శాఖలో ఉన్న ఖాళీల గురించి ప్రభుత్వానికి నివేదించాం. 33 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు సేవల విషయంలో అంతరాయం జరగకుండా జూనియన్‌ ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం. సరఫరాలో ఏదైనా సమస్య వస్తే విద్యుత్తు సిబ్బంది దృష్టికి రైతులు, వినియోగదారులు తీసుకురావాలి. అంతే కానీ వారే స్వయంగా ఫ్యూజులు వేయడం, ఇతరత్రా మరమ్మతులు చేయకూడదు. 
- కేవీజీ సత్యనారాయణ, ఎస్‌ఈ, విద్యుత్తు శాఖ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని