logo

పామూరులో దర్గా కూల్చివేత

పామూరు పట్టణం సి.ఎస్‌.పురం రహదారిలోని పురాతన దర్గాను అధికార పార్టీ నాయకులు సోమవారం జేసీబీతో కూల్చివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముస్లిం సోదరులు నిరసన వ్యక్తం చేస్తూ అధిక సంఖ్యలో సి.ఎస్‌.పురం బస్టాండు నుంచి పోలీస్‌

Published : 24 May 2022 02:20 IST

ముస్లిం సోదరుల నిరసన

పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి

స్టేషన్‌ బయట రహదారిపై ధర్నా నిర్వహిస్తున్న ముస్లిం సోదరులు

పామూరు, న్యూస్‌టుడే: పామూరు పట్టణం సి.ఎస్‌.పురం రహదారిలోని పురాతన దర్గాను అధికార పార్టీ నాయకులు సోమవారం జేసీబీతో కూల్చివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముస్లిం సోదరులు నిరసన వ్యక్తం చేస్తూ అధిక సంఖ్యలో సి.ఎస్‌.పురం బస్టాండు నుంచి పోలీస్‌ స్టేషన్‌కు ప్రదర్శనగా వెళ్లి ముట్టడించారు. దర్గాను పగులగొట్టిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అదే స్థలంలో తిరిగి దర్గాను కట్టించాలని డిమాండ్‌ చేశారు. సుమారు 400 ఏళ్ల క్రితం నుంచి ఉన్న పురాతన దర్గాను అధికార పార్టీకి చెందిన ఓ ముస్లిం ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు కొందరు పగులగొట్టించి ఆ స్థలాన్ని ఆక్రమించి దుకాణం కట్టాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ కె.సురేష్‌ను కోరారు. ఆయన ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో స్టేషన్‌కు ఎదురుగా రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు, ముస్లిం సోదరుల మధ్య వాదన చోటుచేసుకుంది. సీఐ కె.శ్రీనివాసరావు ముస్లిం పెద్దలు, సోదరులతో చర్చలు జరిపారు. బాధ్యులపై కేసు నమోదు చేయడంతో ధర్నాను విరమించారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.సురేష్‌ తెలిపారు. ఖాజీ ఖాదర్‌బాషా, మరో 50 మంది ముస్లింలు ఫిర్యాదుపై ఉప ఎంపీపీ షేక్‌ రషీద్‌, ఆయన కుమారుడు వైకాపా నాయకుడు ఖాదర్‌ బాషా, బారా షరీఫ్‌, రజాక్‌ మరో అయిదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

జేసీబీతో దర్గాను పగులగొట్టి శిథిఫలాలను ట్రాక్టర్‌లో వేస్తున్న దృశ్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని