logo

ఎస్టీ కమిషన్‌ అంటే అంత చులకనా!

ఎస్టీ కమిషన్‌ రాజ్యాంగ బద్ధమైంది. గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నాను. అందుకు సంబంధించిన సమాచారాన్ని కలెక్టర్‌ ద్వారా అధికారులకు ముందస్తుగానే పంపాం. అయినా కొందరు ఎందుకు రాలేదు.. కమిషన్‌ అంటే అంత చులకనగా ఉందా..!’ అని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 13 Aug 2022 05:22 IST

అధికారుల తీరుపై ఛైర్మన్‌ ఆగ్రహం

మాట్లాడుతున్న కుంభా రవిబాబు.. వేదికపై కలెక్టర్‌, జిల్లా అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎస్టీ కమిషన్‌ రాజ్యాంగ బద్ధమైంది. గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నాను. అందుకు సంబంధించిన సమాచారాన్ని కలెక్టర్‌ ద్వారా అధికారులకు ముందస్తుగానే పంపాం. అయినా కొందరు ఎందుకు రాలేదు.. కమిషన్‌ అంటే అంత చులకనగా ఉందా..!’ అని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ.. రెండు రోజులుగా పర్యటనకు గైర్హాజరైన అధికారులకు సంజాయిషీ నోటీసులివ్వాలని కలెక్టర్‌కు సూచించారు. సింగరాయకొండ, కనిగిరి ప్రాంతాలకు వెళ్లినప్పుడు విద్యుత్తు, తాగునీటితో పాటు, ఇతర మౌలిక వసతుల సమస్యలను పలువురు గిరిజనులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. అమాయక గిరిజనులను అధికారులు, పోలీసులు ఇబ్బంది పెట్టినా, చట్ట ప్రకారం వారికి దక్కాల్సిన ప్రయోజనాలను కాపాడటంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజనులు తమ సమస్యలను నేరుగా ఎస్టీ కమిషన్‌ యాప్‌ ద్వారా తన దృష్టికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. సమావేశంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్వో సరళా వందనం, ఎస్టీ కమిషన్‌ సభ్యులు శంకర్‌ నాయక్‌, జిల్లా అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తొలుత గిరిజన భవన్‌లో గిరిజనుల సమస్యలపై ఆయా సంఘాల నాయకులతో రవిబాబు చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు