logo

కొండలపై కన్ను.. అధికారం దన్ను

రూ.కోట్ల విలువైన ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. నిత్యం టిప్పర్ల రాకపోకలు, యంత్రాల రణగొణధ్వనులతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. ఒంగోలు శివారులోని యరజర్ల వద్ద కనిపిస్తున్న పరిస్థితి ఇది.

Published : 27 Sep 2022 02:08 IST

యరజర్లలో మళ్లీ రెచ్చిపోతున్న మట్టి మాఫియా

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు:

పొక్లెయిన్‌తో గ్రావెల్‌ తవ్వి లారీలకు నింపుతున్న దృశ్యం

రూ.కోట్ల విలువైన ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. నిత్యం టిప్పర్ల రాకపోకలు, యంత్రాల రణగొణధ్వనులతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. ఒంగోలు శివారులోని యరజర్ల వద్ద కనిపిస్తున్న పరిస్థితి ఇది.

యరజర్లతో పాటు టంగుటూరు మండలం మర్లపాడు కొండల్లో ఇనుప ఖనిజం, ఎర్రమట్టి అపారంగా ఉన్నాయి. గతంలో ఖనిజం తవ్వకాలకు ప్రభుత్వం ఈ భూములను లీజుకు ఇచ్చింది. అదే పరిసరాల్లో దాదాపు 23 వేల మందికి జగనన్న ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు భూమి చదునుచేసి సరిహద్దు రాళ్లు కూడా పాతారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లడంతో విచారించి మైనింగ్‌ భూములను ఇతర అవసరాలకు వినియోగించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. అధికారులు అక్కడ బోర్డులు సైతం పాతారు. దీంతో ఇళ్లపట్టాల పంపిణీ ఆగిపోయింది. అయితే ఎర్రమట్టికి జిల్లాలో డిమాండ్‌ ఉండటంతో కొందరు అక్రమార్కులు ఈ కొండలపై కన్నేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మట్టిని జేసీబీలతో తవ్వేస్తూ టిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా వివిధ వెంచర్లకు వెళ్తోంది. గతంలో ‘ఈనాడు-ఈటీవీ’ వెలుగులోకి తీసుకురావడంతో కొన్నాళ్ల పాటు తవ్వకాలను నిలిపేశారు. మళ్లీ కొన్ని రోజులుగా అక్రమ దందా కొనసాగుతోంది. గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి  ట్యాంకులతో రోడ్డుపై నీరు చల్లి ఎర్రమట్టిని తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందినవారి అండ ఉండటంతో కొండలు కరిగిపోతున్నాయి. గనులశాఖ డీడీ జగన్నాథరావు వద్ద ప్రస్తావించగా ఆయా ప్రాంతాలకు విజిలెన్స్‌ అధికారులను పంపి చర్యలు తీసుకుంటామన్నారు.

అర్జీలు అందించి..

యరజర్ల కొండ ప్రాంతంలో 328 ఎకరాల కొండ పోరంబోకు భూమిలో అయిదు పొక్లెయిన్లతో తవ్వి 50 టిప్పర్లతో గ్రావెల్‌ను తరలిస్తున్నారని స్థానికులు సోమవారం కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చారు. ఇప్పటివరకు 70 వేల నుంచి 80 వేల టిప్పర్ల మట్టిని తవ్వి తరలించారని,  ఒక్కో లోడు రూ.6 వేలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణం అక్రమ రవాణాను నిలిపివేయాలని అర్జీలో కోరారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts