logo

ఎటు వెళ్లాలి... ఏం చేయాలి!

తమకు ఇష్టమైన వైద్యకోర్సు చేసేందుకు వారు దేశం కాని దేశం వెళ్లారు. బిడ్డల లక్ష్యానికి తల్లిదండ్రులూ తోడుగా నిలిచారు. కష్టార్జితమంతా ఫీజుల రూపంలో చెల్లించారు. అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో యుద్ధం ఉరిమింది. అంతే ఒక్కసారిగా పరిస్థితులే తారుమారైపోయాయి. ఇ

Published : 28 Sep 2022 02:25 IST

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్యవిద్యార్థుల అంతర్మథనం

ఖర్చులు మరింత పెరుగుతాయని వెల్లడి

తమకు ఇష్టమైన వైద్యకోర్సు చేసేందుకు వారు దేశం కాని దేశం వెళ్లారు. బిడ్డల లక్ష్యానికి తల్లిదండ్రులూ తోడుగా నిలిచారు. కష్టార్జితమంతా ఫీజుల రూపంలో చెల్లించారు. అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో యుద్ధం ఉరిమింది. అంతే ఒక్కసారిగా పరిస్థితులే తారుమారైపోయాయి. ఇటు కేంద్రం ప్రకటనలు ఊరటివ్వక, అటు ఎటువైపు అడుగులు వేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చేసిన జిల్లాలోని వైద్య విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి ఇది.

- ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 37 మంది వరకు విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడానికి ఉక్రెయిన్‌ వెళ్లారు. అక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలైంది. అతికష్టంమీద వారంతా జిల్లాకు చేరుకున్నారు. అప్పటికే నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసినవారు కొందరుంటే.. చివరి సెమిస్టర్‌ చదివేవారు, ఏడాదన్నర పూర్తయినవారు మరికొందరు. తాము చదువుతున్న కోర్సు.. యూనివర్సిటీ, వసతిని బట్టి ఇప్పటికే రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షలు వెచ్చించారు. ఆ తర్వాత అర్ధంతరంగా వచ్చేయాల్సి వచ్చింది. గత ఏడు నెలలుగా తమ చదువుకు కేంద్రం ఎలాంటి దారిచూపుతుందోనని ఎదురుచూశారు. భారత విద్యాలయాల్లో వసతి కల్పించలేమని, ఇటువంటి సడలింపులు దేశంలో వైద్యవిద్య ప్రమాణాలకు ఆటంకం కలిగిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో మొబిలిటీ కార్యక్రమంలో భాగంగా మిగిలిన కోర్సు పూర్తిచేసుకోవచ్చని తెలిపింది.

ఎన్నో అనుమానాలు

ప్రస్తుతం విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. క్లినికల్‌, ప్రాక్టికల్‌ తరగతుల పరిస్థితేమిటో అర్థం కావడంలేదు. చివరి సంవత్సరం చదివేవారు.. ఏడాది, రెండేళ్ల తరగతులు పూర్తయినవారు తమ డిగ్రీ ధ్రువపత్రం ఇప్పటివరకు చదివిన వర్సిటీ నుంచి వస్తుందా? కొత్తగా చేరబోయే విద్యాలయం నుంచి వస్తుందో స్పష్టతలేదు. పోలండ్‌, జార్జియా వంటి వివిధ దేశాలకు వెళ్లాలంటే అక్కడ ఖర్చులు, ఫీజులు ఎలా ఉంటాయో తెలియదు. కొందరు మళ్లీ ఉక్రెయిన్‌ వెళ్లాలని భావిస్తుండగా, మరికొందరు ఉజ్బెకిస్థాన్‌ వైపు చూస్తున్నారు. ఇటీవల వెలువడిన ఎన్‌ఎంసీ నోటీసులో మాత్రం వైద్య డిగ్రీని తొలుత చదివిన ఉక్రెయిన్‌ విశ్వవిద్యాలయం నుంచే ప్రదానం చేస్తారని పేర్కొంది.


మార్గదర్శకాలు  పరిశీలించి నిర్ణయం

ఉక్రెయిన్‌లోని జఫ్రోషియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌లో చేరాను. ఏడాదన్నర కోర్సు పూర్తయింది. యుద్ధం కారణంగా వచ్చేశాను. ఏడాదిన్నరకు రూ.5 లక్షలు ఖర్చయింది. ఇప్పుడు మరో దేశం వెళ్లాలంటే ఫీజు, ఇతర ఖర్చులు ఉంటాయి. అలానే డిగ్రీ సర్టిఫికెట్‌ ఎక్కడినుంచి ఇస్తారో కూడా తెలియదు. మార్గదర్శకాలు పరిశీలించి ఏ దేశం వెళ్లాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

-ఎస్‌.కల్యాణ్‌ చక్రవర్తి, ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థి, ఒంగోలు


సెమిస్టర్‌ కోసం  ఉజ్బెకిస్తాన్‌

జఫ్రోషియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ అయిదో సంవత్సరం చదువుతుండేవాడిని. యుద్ధం సమయానికి ఒక సెమిస్టర్‌ మాత్రమే మిగిలి ఉంది. నాలుగైదు నెలలు ఉండుంటే కోర్సు పూర్తయ్యేది. మిగిలిన ఒక సెమిస్టర్‌ ఫీజు, ఖర్చులు అన్నీ మరో రూ.3 లక్షలు అయ్యేది. మొబిలిటీలో భాగంగా ఇప్పుడు ఉజ్బెకిస్థాన్‌ వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయంలో చదవాల్సి ఉంది. పరిస్థితులను బట్టి మరో రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుంది. 

-గద్దె వెంకట సాయి ఆర్య, పామూరు


ఆర్థికంగా అదనపు భారం :  యశ్వంత్‌, ఒంగోలు

ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ నాలుగు సంవత్సరాలు పూర్తి చేశాను. ఈ ఏడాది ఉండుంటే కోర్సు పూర్తయ్యేది. ఇప్పటివరకు రూ.30 లక్షలు వెచ్చించాను. మిగిలిన ఏడాది కోర్సు కోసం మరో దేశం వెళ్లాల్సి వస్తోంది. ఇది ఆర్థికంగా మాకు అదనపు భారం. ఫీజు విషయంలోనూ గందరగోళమే. డిగ్రీ ధ్రువపత్రం విషయంలోనూ స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని