logo

పుస్తకాలు ఇవ్వకుండానే పాఠాలు

విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం... ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా అర్ధ సంవత్సరం గడిపేసింది.

Published : 28 Nov 2022 02:46 IST

పుస్తకాలు ఇవ్వకుండానే పాఠాలు
ఇంటర్‌ విద్యార్థుల అవస్థలు
పామూరు, సి.ఎస్‌.పురం, న్యూస్‌టుడే

పామూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు

విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం... ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా అర్ధ సంవత్సరం గడిపేసింది. అధ్యాపకులు పాఠాలు కూడా చెప్పి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో యూనిట్‌, త్రైమాసిక పరీక్షలు సైతం నిర్వహించారు. అర్ధ సంవత్సర పరీక్షలకు మాత్రం సిలబస్‌ పూర్తికాకపోవడంతో నవంబరు 12 నుంచి జరగాల్సిన వాటిని డిసెంబర్‌ 12కు వాయిదా వేశారు. పాఠ్య పుస్తకం చేతిలో లేకపోవడంతో పాఠాలు అర్థం కాక, పరీక్షల్లో ఏం రాస్తున్నామో తెలియని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంత నిర్లక్ష్యమా..?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జూనియర్‌ కళాశాలలతో పాటు ఇంటర్‌మీడియట్‌ అమలయ్యే ఆదర్శ, కస్తూర్బా, ఫ్లస్‌-2 పాఠశాలల్లో సుమారు 11 వేల మందికి పైగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి. విద్యా సంవత్సరానికి ముందే వాటిని ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది.  తరగతులు ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా.. నేటికీ ఒక్క పాఠ్య పుస్తకం కూడా ఇవ్వలేదంటే ఆ శాఖకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బయట మార్కెట్‌లో పుస్తకాలు లభ్యం కావడం లేదని   విద్యార్థులు వాపోతున్నారు.

పరీక్షలపై ప్రభావం..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎక్కువగా పేదలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉంటారు. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందిస్తేనే వారికి చదువుకోవడానికి వీలుంటుంది. గత ఏడాది కూడా వీటిని సకాలంలో సరఫరా చేయకపోవడంతో ఈ ఏడాది విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో కళాశాలలు వెనుకబడ్డాయి. ఉత్తీర్ణత తగ్గడానికి ఇది కూడా కారణమే. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు స్పందించి పాఠ్య పుస్తకాలు వెంటనే సరఫరా చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో కళాశాలలు, విద్యార్థుల వివరాలు..

* ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు: 32
* ఆదర్శ పాఠశాలలు: 11
* కేజీబీవీలు: 37
* ఫ్లస్‌-2 పాఠశాలలు: 19
* ప్రథమ సంవత్సరం విద్యార్థులు: 5 వేలు
* ద్వితీయ సంవత్సరం విద్యార్థులు: 6 వేలు
* ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు: 169
* వాటిల్లో మొత్తం విద్యార్థులు: 50 వేలు

త్వరలో వస్తాయి..

పాఠ్య పుస్తకాలు త్వరలో జిల్లాలకు సరఫరా అయ్యే అవకాశం ఉంది. కొన్నిచోట్ల పాత వాటిని కొందరికి సర్దుబాటు చేశాం. ప్రభుత్వం సరఫరా చేసిన వెంటనే ఆలస్యం చేయకుండా కళాశాలలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుటాం. డిసెంబరు 12 నుంచి అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతాయి.

ఎ.సైమన్‌ విక్టర్‌, ఆర్‌ఐవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని