logo

ఆశ తప్ప.. పరిశ్రమల ఊసేదీ..?

అదిగో నిమ్జ్‌... ఇవిగివిగో పరిశ్రమలు అన్న మాటలు తప్ప అక్కడ పారిశ్రామికవాడ ఏర్పడింది లేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందీ లేదు.

Published : 29 Jan 2023 02:02 IST

నిమ్జ్‌ ఏర్పాటుపై పాలకుల నిర్లక్ష్యం
ఇతర ప్రాంతాలకు యువత వలస

పార్కులోని భూముల్లో అరకొరగానే మౌలిక వసతులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: అదిగో నిమ్జ్‌... ఇవిగివిగో పరిశ్రమలు అన్న మాటలు తప్ప అక్కడ పారిశ్రామికవాడ ఏర్పడింది లేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందీ లేదు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కనిగిరి. ఇక్కడ జాతీయ పెట్టుబడులు, తయారీ మండలి(ఎన్‌ఐఎంజెడ్‌) ఏర్పాటుకు కేంద్రం పదేళ్ల క్రితమే పచ్చజెండా ఊపింది. గత ప్రభుత్వం హయాంలో భూసేకరణకు అడుగులు పడ్డాయి. కనిగిరి నియోజకవర్గంలోని పామూరు, పీసీపల్లి మండలాల పరిధిలోని భూములను ఇందుకు గుర్తించారు. వీటి సేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాలేదు. పారిశ్రామికవాడ ఏర్పాటుతో స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయనే యువత ఆశలు అడియాసలుగానే మిగిలాయి.

4,390 ఎకరాల గుర్తింపు...: నిమ్జ్‌ ఏర్పాటుకు 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం కనిగిరి నియోజకవర్గంలోని పామూరు, పీసీపల్లి మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు కలిపి 14,390 ఎకరాలు గుర్తించింది. ఇందులో బూదవాడలో 3405, మాలకొండాపురంలో 3209, రేణిమడుగు 1025, సిద్ధవరం 4390 ఎకరాలు, అయ్యన్నకోట 552, పెద్దఇర్లపాడు 1647 ఎకరాలున్నాయి. ప్రైవేట్‌, అసైన్డ్‌ భూముల రైతులకు పరిహారం చెల్లించి సేకరించాల్సి ఉంది.

మాలకొండాపురం వద్ద ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కు సూచిక

మొదటి విడతలో 4,149 ఎకరాల్లో...: మొత్తం మూడు దశల్లో పారిశ్రామికవాడ రూపుదిద్దుకునేలా ప్రణాళిక రచించారు. మొదటిగా రూ.3,640 కోట్లతో 4149 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఎలక్ట్రికల్‌ వాహనాలు, వాహన విడిభాగాలు, పీవీసీ పైపులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఉడ్‌, ఇంజినీరింగ్‌, లాజిస్టిక్స్‌ పార్కు, సోలార్‌ తదితర విభాగాల పరిశ్రమలు ఉంటాయి. మొదటి దశకు సంబంధించిన భూముల విషయంలో ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు కేంద్రానికి నివేదించారు. మొత్తం మూడు విడతల్లో ఇక్కడ పారిశ్రామికవాడ రూపుదిద్దుకుంటే తద్వారా రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

పర్యావరణ అనుమతులు రావాలి...

పామూరు, పీసీపల్లి పరిధిలో నిమ్జ్‌ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం మాలకొండాపురం వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణ పనులు చేపట్టాం. భూసేకరణకు సంబంధించి గతేడాది నవంబరులో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి కేంద్రానికి నివేదించాం. పర్యావరణంపై ఈ ప్రాజెక్టు ప్రభావాన్ని అంచనా వేసి కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అనంతరం భూసేకరణ, ఇతర పనులు వేగవంతం చేస్తాం.

-వెంకటేశ్వర్లు, జెడ్‌ఎం, ఏపీఐఐసీ

నిరుద్యోగుల్లో ఎన్నెన్నో ఆశలు...

నిమ్జ్‌ ఏర్పాటుతో తమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగ యువత ఎంతగానో ఆశ పడింది. కానీ ఏళ్లు గడుస్తున్నా అధికారులు, నాయకుల మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయి. రాజకీయ నాయకులు సైతం నిమ్జ్‌ ఏర్పాటును ఎన్నికల ప్రచార హామీగా వాడుకుంటున్నారే తప్ప చిత్తశుద్ధితో అందుకు కృషి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని