logo

ఆ ఇద్దరు.. భలే ఆవిష్కర్తలు

ఇద్దరు బాలలు తమ మేథస్సుకు పదును పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆపత్కాలంలో ఉపయోగించే అంతర్జాల సేవలకు సంబంధించిన పరికరాన్ని ఆవిష్కరించారు.

Published : 01 Feb 2023 01:50 IST

ప్రశంసలందుకుంటున్న ‘ఇంటర్‌ కం ఎఫ్‌ఎం’ ప్రాజెక్టు

జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక

ప్రాజెక్టును ప్రదర్శిస్తున్న విద్యార్థులు అమోక్‌ శౌరి, స్వయం ప్రకాష్‌

ఇద్దరు బాలలు తమ మేథస్సుకు పదును పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆపత్కాలంలో ఉపయోగించే అంతర్జాల సేవలకు సంబంధించిన పరికరాన్ని ఆవిష్కరించారు. సీబీఎస్‌ఈ సెంట్రల్‌ బోర్డు నిర్వహించిన వివిధ స్థాయి పోటీల్లో ప్రదర్శితమైన ఈ ప్రాజెక్టు బహుమతులందుకోవడంతో పాటు ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైంది. ఆ వివరాలు ఇలా...

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని సాయిబాబా సెంట్రల్‌ స్కూలులో పదో తరగతి చదువుతున్న అమోక్‌ శౌరి, స్వయం ప్రకాష్‌ అనే విద్యార్థులు వారి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు సుదర్శన్‌ మార్గదర్శకంలో అంతర్గత కమ్యూనికేషన్‌(ఇంటర్‌ కం ఎఫ్‌ఎం) పరికరాన్ని రూపొందించారు. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‌ ఉపయోగించి తయారు చేసిన ఈ ప్రాజెక్టును రెండు నెలల క్రితం విజయవాడలో జరిగిన రీజినల్‌ స్థాయి(తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌) పోటీలో ప్రదర్శించారు. అందరి ప్రశంసలు అందుకున్న ఈ ప్రాజెక్టు సీబీఎస్‌ఈ సెంట్రల్‌ బోర్డు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో చోటు దక్కించుకుంది. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏడింటిలో ఒకటిగా నిలవడం విశేషం. ఈ నెల 4న దిల్లీలో జరిగే పోటీలో దీన్ని ప్రదర్శించనున్నారు.

మూడేళ్ల కృషి...: చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడుకు చెందిన అల్లంకి రాము, సుభాషిణి దంపతుల కుమారుడు అమోక్‌ శౌరి. స్వయం ప్రకాష్‌ స్వస్థలం చెన్నై సమీపంలోని పన్నెకాడు. తల్లిదండ్రులు సౌందర రాజన్‌, రాజేశ్వరి. ఈ విద్యార్థులిరువురూ ఆరో తరగతి నుంచి స్నేహితులు. సైన్స్‌పై ఆసక్తితో ఏదైనా కొత్త విషయం కనిపెట్టాలని తపన పడేవారు. వారి ఉత్సాహాన్ని గుర్తించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు సుదర్శన్‌ ఏడో తరగతిలోనే ఈ ప్రాజెక్టు తయారీకి బీజం వేశారు. వారికి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ విజ్ఞానాన్ని పెంచారు. ఎట్టకేలకు వారు పదో తరగతిలోకి వచ్చే సరికి పూర్తి సమాచారంతో ప్రాజెక్టును దిగ్విజయంగా రూపొందించారు.

ప్రయోజనం ఇలా...

‘ఇంటర్‌ కం ఎఫ్‌ఎం ప్రాజెక్టు’ పరికరం ద్వారా ఇంటర్నెట్‌ అందుబాటులో లేకపోయినా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‌ సాయంతో ఇతరులతో మాట్లాడవచ్చు. వాయిస్‌ కాల్స్‌, చాటింగ్‌ చేయవచ్చు. ఇందులో మెష్‌ నెట్‌వర్కింగ్‌ విధానాన్ని ఉపయోగించినట్లు విద్యార్థులు తెలిపారు. దీనిలో రాస్ప్‌బెర్రీ, ఎస్‌డీ కార్డు, వైఫై అడాప్టర్‌ను వినియోగించినట్లు పేర్కొన్నారు. విపత్తు, యుద్ధ సమయాల్లో కమ్యూనికేషన్‌ దెబ్బతిని సమాచారం స్తంభించిన సమయంలో ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో రొబోటిక్‌ ఇంజినీరింగ్‌ చదువుతానని అమోక్‌ శౌరి, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌ కావాలని స్వయం ప్రకాష్‌ తమ లక్ష్యాలను వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని