logo

మంత్రి చెప్పినా చెవికెక్కలేదు

మహా శివరాత్రి వస్తుందంటే త్రిపురాంతకంలో పండగ సందడి నెలకొంటుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలకు త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నట్లు అధికారుల అంచనా.

Updated : 06 Feb 2023 12:23 IST

శివరాత్రి పనుల్లో ఏదీ పురోగతి
ఈసారీ ఇబ్బందులు తప్పవా

మంత్రి సురేష్‌ సొంత నిధులతో నిర్మిస్తున్న ముఖద్వారం

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: మహా శివరాత్రి వస్తుందంటే త్రిపురాంతకంలో పండగ సందడి నెలకొంటుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలకు త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నట్లు అధికారుల అంచనా. గతం కంటే ఈ ఏడాది భిన్నంగా నిర్వహించేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో జనవరి 20న అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై ఫిబ్రవరి 6న మళ్లీ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసినా దేవాదాయ, పోలీసు శాఖలు మినహా మిగతా శాఖల ఆధ్వర్యంలో జరగాల్సిన పనుల్లో ఎలాంటి పురోగతి లేవడం ఆవేదన కలిగిస్తోంది. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ గోపురానికి సున్నం, రంగులు వేయించారు.

అసౌకర్యాలెన్నో..

బాలాత్రిపురసుందరీదేవి ఆలయం వెలుపలి వైపు దాతల సహకారంతో ఇనుప క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా భక్తుల రాకపోకల రద్దీ నేపథ్యంలో విద్యుత్తు ఉప కేంద్రం మట్టి రహదారికి మరమ్మతులు చేపట్టాలని తీర్మానించినా ఆ దిశగా అడుగులు వేయలేదు. యర్రగొండపాలెం వైపు నుంచి కూడా భక్తులు రానున్న వేళ తారు రోడ్డుకు ఇరువైపులా  కేబుల్‌ వేయడానికి తీసిన కాలువ అక్కడక్కడా పూడ్చకపోవడంతో రోడ్డు మార్జిన్‌ దిగితే ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఎన్నెస్పీ కాలువ వంతెనపై గుంతలను పూడ్చాల్సిందిగా మంత్రి ఆదేశించినా నేటికి ఆ వైపు తొంగి చూసిన నాథుడు లేరు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇటుక బట్టీలు ఉండటంతో మట్టి, ఇటుక తరలింపుతో బాలాత్రిపుర సుందరీదేవి ఆలయానికి రాకపోకలు సాగించే తారు రోడ్డు మట్టితో నిండిపోయింది. ఉత్సవాల నేపథ్యంలో బట్టీల ట్రాక్టర్ల రాకపోకలను ఆపుతామని అధికారులు చెప్పినా ఆ దిశగా చర్యలు చేపట్ట లేదు. గ్రామం నుంచి ఆలయాల వరకు విద్యుత్తు స్తంభాలకు విద్యుత్తు దీపాల ఏర్పాటుకు ఇంకా శ్రీకారం చుట్ట లేదు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం తూర్పు మెట్ల మార్గం నుంచి పండుగ రోజున అధిక సంఖ్యలో భక్తులు కొండ మీదకు రాకపోకలు సాగిస్తుంటారు. ఆ మార్గంలోని మెట్లకు రెండు వైపులా అమర్చిన ఇనుప రెయిలింగ్‌ పడిపోయింది. దీంతో భక్తులు కింద పడి ప్రమాదాలకు గురయ్యే వీలుంది. వీటిని పునర్‌ నిర్మిస్తే భక్తులు మెట్ల మార్గాన సులువుగా కొండపైకి రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉంటుంది.

మెట్ల మార్గంలో కూలిన ఇనుప రెయిలింగ్‌

ముఖద్వారం పనుల పూర్తి

మంత్రి సురేష్‌ రూ.31లక్షల సొంత నిధులతో త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ఘాట్‌ రోడ్డు దిగువన నిర్మిస్తున్న ముఖద్వారం పనులు చివరికి చేరాయి. ఉత్సవాల నాటికి రంగులతో తీర్చిదిద్దితే భక్తులను ఆకర్షించనుంది. ఉత్సవాల సమయం గడువు దగ్గర పడుతున్నందున సంబంధిత శాఖల అధికారులు పనులను సత్వరమే పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సకల సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని