logo

మార్కాపురంలోభారీ అగ్నిప్రమాదం

విద్యుత్తు షార్టు సర్య్కూట్‌ కారణంగా మార్కాపురం పట్టణం శివాలయం సమీపంలో ఉన్న శ్రీనివాస హార్డ్‌వేర్‌, జనరల్‌ ఫ్యాన్సీ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Published : 09 Feb 2023 03:23 IST

దగ్ధమైన పెయింటింగ్‌ దుకాణం..  
సమీప ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు

మంటల్లో దగ్ధమవుతున్న భవన సముదాయం

మార్కాపురం నేర విభాగం, న్యూస్‌టుడే : విద్యుత్తు షార్టు సర్య్కూట్‌ కారణంగా మార్కాపురం పట్టణం శివాలయం సమీపంలో ఉన్న శ్రీనివాస హార్డ్‌వేర్‌, జనరల్‌ ఫ్యాన్సీ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆరంతస్తుల భవనంలో యజమాని పెద్ద ఎత్తున పెయింటింగ్‌, ఇతర సామగ్రి నిల్వ ఉంచడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. తొలుత మార్కాపురం అగ్నిమాపక శకటం చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అనంతరం యర్రగొండపాలెం, పెద్ద దోర్నాల, కంభం నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనమంతా అగ్నికీలలు చుట్టుకోవడం, పెద్దఎత్తున ఎగసి పడుతుండటంతో నియంత్రించేందుకు  తీవ్రంగా శ్రమించారు. భవనం మూడో అంతస్తులో సరకు భారీగా ఉండటంతో రాత్రి ఒంటి గంట వరకు కూడా అదుపు చేయడం కష్టంగా మారింది. విద్యుత్తు అధికారులు సరఫరాను నిలిపి వేయడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. సుమారు కోటి రూపాయల విలువ చేసే సరకు నష్టపోయినట్లు దుకాణ యజమాని టి.సుబ్రహ్మణ్యం తెలిపారు.

ముందుజాగ్రత్తగా...

భారీ అగ్నికీలల నేపథ్యంలో సంఘటనా స్థలానికి సమీపంలోని పది ఇళ్లలో నివాసితులను ఖాళీ చేయించారు. మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌, సీఐ భీమానాయక్‌, ఎస్సైలు శశికుమార్‌, సువర్ణ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు