logo

మన ఆహారమే ఔషధం కావాలి

పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated : 19 Mar 2023 05:40 IST

ఓ స్టాల్‌ వద్ద వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, చిత్రంలో ప్రకృతి వనం ప్రసాద్‌ తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో... చిరుధాన్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘ఈట్‌ రైట్‌ ఇండియా - మిల్లెట్‌ మేళా’ పేరిట గాంధీ పార్కులో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ మాట్లాడుతూ... రోగాల బారినపడి మందులు వేసుకోవడం కంటే, మనం తీసుకునే ఆహారమే శరీరానికి ఔషధంలా పనిచేసేలా చూసుకోవాలన్నారు. నాటి తరానికి చిరుధాన్యాలే ప్రధాన ఆహారంగా ఉండేదని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి... చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ పదార్థాలను రుచి చూశారు. ముందుగా కలెక్టరేట్‌ నుంచి గాంధీపార్కు వరకు నిర్వహించిన ర్యాలీని జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సహాయ ఫుడ్‌ కంట్రోలర్‌ ప్రభాకరరావు, కేంద్ర ప్రభుత్వ పుడ్‌ సేప్టీ అధికారి సయ్యద్‌ అబ్దుల్‌, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్‌ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

చిరుధాన్యాలతో కూడిన ఆహారం తినడం వల్ల... వాటిలో ఉండే పీచు పదార్థాల వల్ల త్వరగా ఆకలి వేయదు. చక్కెర వంటి వ్యాధులు నియంత్రణలో ఉండడంతో పాటు... కొవ్వు పెరగదు. శీతల పానీయాలు తాగడం మానేసి... సీజన్ల వారీగా లభించే మామిడి, సపోటా, జామ వంటి పండ్లను తీసుకోవడం ఉత్తమం. నూడుల్స్‌, పానీపూరీ వంటి చిరుతిళ్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి. బియ్యం వినియోగించాల్సి వస్తే పాలిష్‌ పట్టని ముడి బియ్యాన్ని మాత్రమే వినియోగించాలి.          - ప్రకృతి వనం ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని