logo

ఎన్నికల వేళ.. ఎన్ని విచిత్రాలో అన్నా

అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది.

Updated : 28 Mar 2024 06:35 IST

అయిదేళ్లుగా వదిలేసి..ఇప్పుడు పనుల హడావుడి
శివారు ఓట్లు పొందేందుకు ఎత్తుగడ
న్యూస్‌టుడే, మార్కాపురం అర్బన్‌

యిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది. వారి కనుసైగతో ఇప్పుడు అధికారులు అభివృద్ధి పనులు గాభరా..గాభరాగా చేసేస్తున్నారు. కోడ్‌ కూసిన వేళ ఓట్లు దండుకునేందుకు వేస్తున్న ఎత్తుగడ అంటూ శివారు కాలనీ వాసులు పెదవి విరుస్తున్నారు.

పశ్చిమ ప్రకాశంలో కీలక పట్టణమైన మార్కాపురం అయిదేళ్లుగా అసౌకర్యాలతో మగ్గుతోంది. పట్టణంలోని శివారు కాలనీల్లో ఎక్కడ చూసినా దెబ్బతిన్న రహదారులు, కాలువలు, వెలగని వీధి దీపాలు, పాడైన నీటి పైపులే దర్శనమిస్తున్నాయి. కాలనీల వాసులు ఎంత మొత్తుకున్నా అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సరిగ్గా ఎన్నికల నగారా మోగిన వేళ పాలకులకు ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇంకేం పాలకుల మనసు దోచేందుకు ఇదే సరైన తరుణమని అధికారులు పనులు చేపడుతూ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అధికార పార్టీ నూతన సమన్వయకర్త చెప్పిందే వేదంగా క్షణాల్లో  జరిగిపోతున్నాయి. సాధారణ రోజుల్లో నిధుల సమస్య అంటూ కాలం వెళ్లదీసే పుర అధికారులు ఇప్పుడు స్వామి భక్తి చాటుకుంటున్నారు.

పాత తేదీలతో...

మార్కాపురం పట్టణంలో జన సంఖ్య లక్షకు పైమాటే. 35 వార్డుల్లో విస్తరించినా..  సౌకర్యాలు కల్పించడంలో అధికార వైకాపా పాలకవర్గం పూర్తిగా విఫలమైంది. దూపాడు నుంచి పట్టణానికి నీటి సరఫరా అయ్యే పైపు లైన్‌ తరచూ మరమ్మతులకు గురవుతున్నా...కొత్తవి అమర్చి నీటి సమస్య లేకుండా చేయడంలో నిర్లక్ష్యం చూపింది. ఎన్నికలకు ముందు నూతన సమన్వయకర్త లేఖపై బాధ్యతల్లో చేరిన కీలక అధికారితో పాటు దీర్ఘకాలికంగా పాతుకుపోయిన మరో ముఖ్య అధికారి జీ హుజూర్‌ అంటూ పనులు చేస్తున్నారు. కోడ్‌ అమల్లో ఉన్న పట్టించుకోకుండా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పాత తేదీలతో చకచక పనులు ప్రారంభిస్తున్నారు.

కోడ్‌ కూతకు కాస్త ముందు..

పట్టణంలోని సుందరయ్య కాలనీ ఏళ్ల తరబడి నుంచి కనీస సౌకర్యాలు కొరవడ్డాయి.  దీనిపై ప్రతిపక్షాలు పదే పదే నిరసనలు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. కాలనీకి చేరుకునేందుకు ప్రధాన మార్గం రహదారి నిర్మించాలని కాలనీవాసులు కాళ్లరిగేలా తిరిగారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎన్నికల కోడ్‌కు ముందే పనులకు శంకుస్థాపనలు చేసి ఇప్పుడు చకచక పూర్తి చేస్తున్నారు. సుందరయ్య కాలనీలో గ్రావెల్‌ రోడ్డు నిర్మిస్తున్నారు.

తూర్పు వీధిలో నీటి కొరత ఉందంటూ వైకాపా శ్రేణులు గగ్గోలు పెట్టడంతో అక్కడ సైతం నూతన బోరు వేయించి పైపులైను పనులు ప్రారంభించారు. ఈ విధంగా పట్టణంలో చాలా వీధుల్లో శ్రేణులు అడిగిన పనులన్నింటినీ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఓట్లు రాబట్టుకునేందుకు వైకాపా వేస్తున్న ఎత్తుగడ అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న వైకాపా పాలక వర్గానికి వత్తాసు పలికే విధంగా కమిషనరు, డీఈ వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని