logo

దర్శి బరిలో నిలిచేదెవరు!

జిల్లా రాజకీయాలను ఉత్కంఠతో ఊపేస్తున్న నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి తెదేపా కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు.

Updated : 28 Mar 2024 06:37 IST

శిద్దా ముందరి కాళ్లకు బెదిరింపులతో బంధం
మాగుంట పేరు పరిశీలిస్తున్న తెదేపా అధిష్ఠానం
ఈనాడు, ఒంగోలు- ఒంగోలు, న్యూస్‌టుడే

జిల్లా రాజకీయాలను ఉత్కంఠతో ఊపేస్తున్న నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి తెదేపా కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి అనంతరం వైకాపాలో చేరిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తిరిగి సొంత గూటికి చేరుతారనే అంతా భావించారు. బుధవారం ఆయన చేరిక ఉంటుందని జోరుగా ప్రచారం సాగిన నేపథ్యంలో అధికార వైకాపా మంత్రాంగం నడిపింది. ఆయన వ్యాపారలావాదేవీల చూపి అడ్డుకోగలిగింది. తన గూట్లోనే కట్టి పడేసింది. ఈ నేపథ్యంలో తెదేపా కూటమి అభ్యర్థి ఎవరనేది మరోసారి ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా యువ పారిశ్రామికవేత్త, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవ్‌రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. తెదేపా అధిష్ఠానం నుంచి వచ్చిన ప్రతిపాదనకు మాగుంట కుటుంబం సైతం అంగీకరించినట్లు సమాచారం.

సంకేతాలిచ్చి.. వెనకడుగేసి...: మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తెదేపాలో చేరుతారనీ, ఆయనే ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. శిద్దా కూడా నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులకు ఆ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఇంతలో వైకాపా అనూహ్యంగా చక్రం తిప్పింది. శిద్దా వ్యాపార లావాదేవీలను బూచిగా చూపి బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. దీంతో ఆయన ముందరి కాళ్లకు బంధం వేసింది. తెదేపా వైపు మొగ్గు చూపకుండా వైకాపా నాయకులు నిలువరించగలిగారు. సీఎంను కలిసిన తర్వాత ‘ప్రస్తుతం వైకాపాలోనే ఉన్నాను. ఈ సారి పోటీ చేయడం లేదు’ అని నిర్లిప్తంగా శిద్దా సమాధానం చెప్పడం గమనార్హం.

టికెట్‌ కోసం పోటాపోటీ...: తాజాగా దర్శి అభ్యర్థి కోసం తెదేపా అధిష్ఠానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. కూటమి అభ్యర్థిగా జనసేన బాధ్యుడు గరికపాటి వెంకట్‌తో పాటు తెదేపా నూతన ఇన్‌ఛార్జి గోరంట్ల రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే దివంగత గొట్టిపాటి నరసయ్య కుమార్తె డాక్టర్‌ కడియాల లక్ష్మి పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య కుమారుడు కృష్ణచైతన్య కూడా తనవంతు ప్రయత్నాలు చేశారు. తాజాగా వైకాపాకు చెందిన సిటింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కూడా తెదేపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవ్‌రెడ్డిని బరిలోకి దింపాలని తెదేపా అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29 నుంచి మాగుంట రాఘవ్‌రెడ్డి దర్శిలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని