logo

నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

నామపత్రాల స్వీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు.

Published : 17 Apr 2024 03:36 IST

మీడియా సెల్‌ ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం: నామపత్రాల స్వీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా తరలిస్తున్న అనుమానిత నగదు, ఇతర వస్తువుల కట్టడి, తదితర అంశాలపై ఆయన జిల్లాల వారీగా సమీక్షించారు. సి-విజిల్‌ యాప్‌ ద్వారా వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.1.30 కోట్లకుపైగా అనుమానిత నగదు, ఇతర వస్తువులను సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏఆర్వోల ప్రతిపాదనలను కూడా త్వరలోనే పంపుతామని వివరించారు. పోలింగ్‌ నిర్వహణకు సంబంధించిన సామగ్రి అన్ని కేంద్రాలకు చేరేలా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో శ్రీలత తదితరులు పాల్గొన్నారు.  

కలెక్టరేట్‌లో మీడియా సెల్‌..

ఒంగోలు గ్రామీణం: జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, సమాచారాన్ని, ప్రవర్తనా నియమావళి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా మీడియా సెల్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని రికార్డు భవనంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సెల్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నట్లు వివరించారు. సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లల్లో చైతన్యం, పోలింగ్‌ శాతాన్ని పెంచడం కోసం అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేసి జిల్లాలో స్వీప్‌ ద్వారా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ముందస్తు అనుమతులు ఇవ్వడంతోపాటు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే పెయిడ్‌ వార్తలను పర్యవేక్షించేందుకు కమిటీను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక కలెక్టర్‌ ఝాన్సీలక్ష్మి, డీఐపీఆర్వో గ్రేస్‌ లినోర, డీపీఆర్వో రమేష్‌, డివిజనల్‌ పీఆర్వో దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని