logo

రగడ.. ఇదేం మర్యాద

క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్‌ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి.

Published : 20 Apr 2024 03:03 IST

రౌడీల్లా మారిన విద్యార్థులు
ట్రిపుల్‌ ఐటీలో డిష్యుం డిష్యుం
క్యాంపస్‌లో సీనియర్‌, జూనియర్ల కొట్లాట

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్‌ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోని విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. జూనియర్లు, సీనియర్లు పరస్పరం కొట్లాటకు దిగారు. ఈ ఉదంతం అందరినీ నివ్వెరపరిచింది. సీనియర్లకు జూనియర్లు తగిన మర్యాద ఇవ్వడం లేదంటూ మొదలైన రగడ చినికి చినికి గాలి వానగా మారింది. గురువారం అర్ధరాత్రి వసతి గృహాల ప్రాంగణంలో దాడుల వరకు వెళ్లింది. రాత్రి 11.30కు మొదలైన గొడవ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. వసతి గృహం వద్ద ఉన్న కేర్‌ టేకర్‌, వాచ్‌మెన్‌లు అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి డైరెక్టర్‌, ఇతర అధికారుల దృష్టికి వెళ్లడంతో సద్దుమణిగింది. ఈ ఘర్షణలో కొందరికి దెబ్బలు తగిలినట్లు సమాచారం. పోలీసుల దృష్టికి వెళ్తే విద్యాసంస్థ పరువు పోతుందని, ఫిర్యాదు చేయకుండా అంతర్గతంగానే చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఉదంతంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శుక్రవారం చర్చించింది. గొడవకు కారకులైన విద్యార్థులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోసారి వివాదాలకు దిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు చేశారు.

తెలిసినా.. పట్టించుకోని అధికారులు...: ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీకి సొంత భవనాలు లేకపోవడంతో అధికారులు రావ్‌ అండ్‌ నాయుడు, ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల భవనాలను అద్దెకు తీసుకుని తరగతులు, వసతి గృహం నిర్వహిస్తున్నారు. రావు అండ్‌ నాయుడులో 1,500 మంది, ఎస్‌ఎస్‌ఎన్‌లో 3,000 మంది వరకు ఉన్నారు. 2018 బ్యాచ్‌ విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాశాక బయటికి వెళ్లిపోతారు. వారికి 2019 బ్యాచ్‌ విద్యార్థులకు మధ్య కొంతకాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఆ విషయం అధికారుల దృష్టికి వచ్చినా తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడే అదే గ్యాంగ్‌ వార్‌ కింద మారి విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

కళాశాల ప్రాంగణంలో ఘర్షణ పడుతున్న విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని