logo

‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు

ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Updated : 24 Apr 2024 05:27 IST

ఫిర్యాదుపై విచారణకు ఆదేశాలు

ఈనాడు-అమరావతి: ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఒంగోలు మండలం మల్లీశ్వరపురం, ఎ.అగ్రహారం, వెంగముక్కలపాలెం, యరజర్లలో 493.28 ఎకరాల భూమిని రూ.201.33 కోట్లకు కొనుగోలుకు వైకాపా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో భారీఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఓ తెలుగు మాస పత్రిక ఎడిటర్‌ సుధీర్‌ కుమార్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ‘భూముల కొనుగోలు కోసం జిల్లా కలెక్టర్‌ కమిటీని ఏర్పాటు చేయలేదు. నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. ధర నిర్ధరణలో వ్యక్తులు, గ్రూపులు లబ్ధి పొందేలా వ్యవహరించారు. ఇందులో రూ.201.33 కోట్ల మేర ప్రజాధనం దోపిడీకి గురైంది. బాధ్యులైన జిల్లా కలెక్టర్‌, జేసీ, ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు(భూసేకరణ), ఆర్డీవో, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ల్యాండ్‌ అండ్‌ సర్వే), ఒంగోలు తహసీల్దార్‌, ఒంగోలు మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి. భూ రికార్డులకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారు. పట్టాదారు, ప్రభుత్వ ఎసైన్‌మెంట్‌, పోరంబోకు స్థలాల విషయంలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకొని నివేదిక పంపాలని భూ పరిపాలన విభాగాన్ని రెవెన్యూ శాఖ ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని