logo

వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది.

Updated : 24 Apr 2024 05:22 IST

నాడు దిక్కంటూ తాయిలాలు
 నేడు రాజీనామాకు బెదిరింపులు

దర్శిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శివప్రసాద్‌ రెడ్డికి రాజీనామా లేఖలు అందిస్తున్న కేవీపాలెం వాలంటీర్లు

ఈనాడు, ఒంగోలు

  • చీమకుర్తి పురపాలక సంఘంలో 64 మంది వార్డు వాలంటీర్లు సోమవారం తమ రాజీనామా పత్రాలను కమిషనర్‌కు సమర్పించారు.
  • తాళ్లూరులోని రెండు సచివాలయాలకు చెందిన 30 మంది వాలంటీర్లు ఒకేరోజున ఎంపీడీవో రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు సమర్పించారు.
  • దర్శి నగర పంచాయతీలోని అయిదు సచివాలయాల పరిధిలో 86 మంది వాలంటీర్లు సోమవారం ఒక్కరోజే రాజీనామా చేశారు.
  • దొనకొండ మండలంలో చందవరం, పోలేపల్లి, కొచ్చెర్లకోట గ్రామాలకు చెందిన 18 మంది మంగళవారం రాజీనామా లేఖలను అధికారులకు అందజేశారు.

 ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వారితో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛను అందించి గొప్పగా ప్రచారం చేసుకుంది. వాలంటీర్ల వ్యవస్థ భేష్‌ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ పలుమార్లు వారిపై ప్రశంసలు కురిపించారు. సేవారత్న పేరుతో పురస్కారాలు, వాలంటీర్లకు వందనం పేరుతో నగదు ప్రోత్సాహకాలు కూడా అందించారు. కాబోయే నాయకులంటూ కీర్తించారు. ఇటీవల వైకాపా అభ్యర్థులు కూడా వారితో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తాయిలాలు అందించి తమకోసం పనిచేయాలంటూ ప్రాధేయపడ్డారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించకూడదనే ఈసీ ఆదేశాలతో ఇప్పుడు పరిస్థితి మారింది. వైకాపా నాయకుల నిజ స్వరూపం బయట పడింది. వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీ ప్రచారంలో పాల్గొనాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. తమకు ఉద్యోగాలు అవసరం అని.. చేయమని చెబుతున్నా వినడం లేదు. బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఆయా అధికారులకు లేఖలు అందించగా.. మరికొందరు ఏం చేయాలో పాలుపోని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని