logo

ఎచ్చెర్ల మనదే..!

జిల్లాల పునర్విభజన కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల నైసర్గిక స్వరూపాలు, విలీన మండలాలు, మారిన రెవెన్యూ డివిజన్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటిని రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించింది. పార్లమెంటు నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు

Updated : 26 Jan 2022 06:02 IST

దూరమైన రాజాం, పాలకొండ

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, రాజాం

జిల్లాల పునర్విభజన కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల నైసర్గిక స్వరూపాలు, విలీన మండలాలు, మారిన రెవెన్యూ డివిజన్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటిని రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించింది. పార్లమెంటు నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఆమేరకు జిల్లాల పునర్విభజనపై కసరత్తు ఎట్టకేలకు పూర్తయింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ రావడమే తరువాయి. ఇప్పటివరకూ 38 మండలాలతో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇకపై 30 మండలాలతో కొనసాగనుంది.

రెండే రెవెన్యూ డివిజన్లు

ఇప్పటివరకూ జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లు ఉండేవి. ఇకపై శ్రీకాకుళం, టెక్కలి మాత్రమే ఉంటాయి. పాలకొండ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు కానున్న ‘మన్యం’ జిల్లాలో కలుస్తున్న నేపథ్యంలో ఆ రెవెన్యూ డివిజన్‌లో ఇదివరకున్న ఇతర మండలాలను శ్రీకాకుళం, టెక్కలిలలో కలిపేశారు. రెవెన్యూ డివిజన్‌లో ఇప్పటికే ఉన్న 13 మండలాలకు అదనంగా కొత్తూరు, హిరమండలం, సారవకోట వచ్చి చేరడంతో సంఖ్య 16కు చేరింది. టెక్కలి రెవెన్యూ డివిజన్‌లో పాతపట్నం, మెళియాపుట్టి చేర్చడంతో దాని మండలాలు 14కు చేరాయి. శ్రీకాకుళం(16), టెక్కలి(14) రెవెన్యూ డివిజన్లతో కొత్త సిక్కోలు రూపు దిద్దుకోనుంది.

ప్రత్యేక మినహాయింపుతో..

జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి అందరి చూపు ఎచ్చెర్ల నియోజకవర్గంపైనే ఉంది. జిల్లాలోనే అతిభారీ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నది ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే. ఎచ్చెర్లకు శ్రీకాకుళంతో చాలా దగ్గరి అనుబంధం ఉందని, జిల్లాలు పునర్విభజన చేసినా ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళంతో కలిపి ఉంచాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ మేరకు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎచ్చెర్ల నియోజకవర్గం కూడా సిక్కోలులో భాగంగానే ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చి సిక్కోలులో భాగంగానే ఉంచడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో రాజాం నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో రాజాం, పాలకొండ ఉన్నాయి. ఇప్పుడు రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాలూ విజయనగరం జిల్లాలో కలుస్తున్నాయి. పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాలు కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లాలో భాగం కానున్నాయి. అంటే మొత్తం ఎనిమిది మండలాల ప్రజలు సిక్కోలు నుంచి విడిపోయి రెండు ఇతర జిల్లాల్లో కలుస్తున్నారు.


భౌగోళిక స్వరూపం దృష్ట్యా

రాష్ట్రంలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో భౌగోళిక స్వరూపం రీత్యా అరకుకు మాత్రమే రెండు జిల్లాల అవకాశం దక్కింది. అరకు, పాడేరు, పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ, రంపచోడవరం నియోజకవర్గాలతో ప్రస్తుతం దేశంలోనే అత్యధిక భౌగోళిక విస్తీర్ణం ఉన్న నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. అరకు పార్లమెంటుని అరకు, మన్యం జిల్లాలుగా విభజించారు. పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లోని 10 మండలాలు, పాలకొండలో రెవెన్యూ డివిజన్‌లో మిగిలిన 6 మండలాలతో కలిపి మన్యం జిల్లా ఏర్పాటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని