logo

మూలపడిన ప్రయోగం!

జిల్లాలో కంచిలి, సీతంపేట, పలాస, డోలపేట, పోలవరం, కోటబొమ్మాళి, జి.సిగడాం, మడ్డువలస, నందిగాం, బొమ్మిక, దుప్పలవలస, కొల్లివలస, ఇప్పిలి, మల్లి తదితర ప్రభుత్వ పాఠశాలలతో పాటు శ్రీకాకుళం...

Published : 27 Jan 2022 06:12 IST

శిక్షకుల కొరతే కారణం

న్యూస్‌టుడే, సోంపేట

కంచిలి జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో 2019లో అన్ని సదుపాయాలతో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ఐదు విభాగాలకు సంబంధించిన అంశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రూ. 20 లక్షలు వెచ్చించి పరికరాలు కొనుగోలు చేశారు. శిక్షకుడిని మాత్రం నియమించలేదు. దీంతో ఉపాధ్యాయులు ఖాళీ సమయాల్లో విద్యార్థులకు కొన్ని అంశాలపై తర్ఫీదు ఇవ్వడం తప్పిస్తే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేక పోతున్నారు. పలు పాఠశాలల్లో ఈ మాత్రం కూడా లేక విలువైన పరికరాలు మూలన పడేశారు. రూ.5.60 కోట్ల విలువైన పరికరాలు పనికి రాకుండా పోతున్నాయి.

జిల్లాలో కంచిలి, సీతంపేట, పలాస, డోలపేట, పోలవరం, కోటబొమ్మాళి, జి.సిగడాం, మడ్డువలస, నందిగాం, బొమ్మిక, దుప్పలవలస, కొల్లివలస, ఇప్పిలి, మల్లి తదితర ప్రభుత్వ పాఠశాలలతో పాటు శ్రీకాకుళం ఆర్‌.కె.స్కూలు, పలాస-కాశీబుగ్గ శ్రీగురుకుల విద్యాలయం, పొలాకి విశ్వశాంతి హైస్కూలు, విజ్ఞాన్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాల తదితర ప్రైవేటు హైస్కూళ్లలోనూ అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద 28 చోట్ల ఇవి ఏర్పాటయ్యాయి. 2017 నుంచి 2021 వరకు వీటిని మంజూరు చేసి అనుగుణంగా ఒక్కో చోట రూ.20 లక్షల విలువైన పరికరాలు సమకూర్చారు. ప్రతి స్కూలులో దీనికి గాను అన్ని వసతులు, ఫర్నీచర్‌తో ప్రత్యేక గది కేటాయించారు.

ల్యాబ్‌లు మంజూరైన స్కూళ్ల వివరాలు

జడ్పీ ఉన్నతపాఠశాలలు 8

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు: 1

మోడల్‌ విద్యాలయాలు: 3
సాంఘిక సంక్షేమ గురుకులాలు 8

గిరిజన గురుకులాలు 4

 

ప్రైవేటు స్కూళ్లు: 4

ఐదు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు అవకాశం

టాయ్స్‌, ట్రేడిషనల్‌టూల్స్‌, అగ్రిఅండ్‌పుడ్‌, రోబోటిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలపరంగా ఐదు విభాగాల్లో విద్యార్ధులకు తర్ఫీదు ఇచ్చేందుకు వీలుగా వివిధ రకాల పరికరాలు ప్రయోగశాలలకు అందజేశారు. గేమ్స్‌, ఇతర బొమ్మలతయారీ, ఇంజనీరింగ్‌ ప్రాజెక్టుల తయారీ, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన ప్రాజెక్టులు, రోబోటిక్‌, సెన్సార్‌, ఎలక్ట్రానిక్స్‌, త్రీడి ప్రింటింగ్‌, ఆటోమిషన్‌, వెబ్‌సెట్‌, ప్రోగ్రామింగ్‌, ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తదితర అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. శిక్షణ ఇచ్చే ఇన్‌స్ట్రక్టర్‌ల నియామకం లేకపోవడంతో ‘ప్రయోగం’ మూలన పడింది.

ఇన్‌స్ట్రక్టర్ల ఏర్పాటుకు చర్యలు

జిల్లా విద్యాశాఖాధికారి, ఇతర అధికారులతో మాట్లాడి అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. పరికరాలు విద్యార్థులకు వినియోగపడేలా ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాల్సి ఉంది. జిల్లా అధికారులతో చర్చించిన తరువాత ఇవి పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చర్యలు చేపడతాం. జిల్లాపరిషత్తు పరంగా అందించాల్సిన సాయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం.

-పిరియా విజయసాయిరాజ్‌, జడ్పీ అధ్యక్షురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని